నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత... నాగనూల్, ఎండబెట్ల, ఉయ్యాలవాడ, దేశి ఇటిక్యాల, నెల్లి కొండను నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదునుగా చూసుకొని రియల్ వ్యాపారులు ఈ గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న కుంటలు, చెరువు శిఖం భూములు కబ్జాలు చేస్తున్నారు. నాగనూల్ వద్ద ఉన్న పుట్నాల కుంటను భూబకాసురులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో 16.1 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంట అలుగును గతేడాది డిసెంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తుంది.
కుంట సమీపంలో ఓ వ్యక్తి కొంత వ్యవసాయ భూమి కొనుగోలు చేసి... బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే భూమి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ భూమిని తవ్వి కట్టలు కట్టినట్లుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇదేవిధంగా జిల్లా కేంద్రం సమీపంలోని నెల్లికొండ సమీపంలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణం ఉన్న చౌటకుంట కట్టను పూర్తిగా ధ్వంసం చేశారు. నాగర్‌కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మించడం వల్ల ఆ భూమికి డిమాండ్ పెరిగింది. చుట్టుపక్కల భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. దీనికి ఆశపడి కొందరు రియల్ వ్యాపారులు దాదాపు 10, 11 నెలల క్రితమే కట్ట ఆనవాళ్లు లేకుండా చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కుంట గట్టును ధ్వంసం చేశారని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా అప్పుడు అధికారులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.