'భూములు లాక్కొని మా పొట్ట కొట్టొద్దు'
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువలో భాగంగా భూములు కోల్పోతున్న వారు తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్రధాన కాలువ వల్ల భూములు కోల్పోతున్న వారు తమ భూముల్ని బలవంతంగా లాక్కోవద్దని కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఇప్పటికే.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, మిషన్ భగీరథ ప్రాజెక్టులో తమ భూములు కోల్పోయామని వాపోయారు. ఇప్పుడు కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామంలో 130 మంది రైతులకు చెందిన 270 ఎకరాల భూములను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువ కోసం తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉన్న అర, ఒక ఎకరం కూడా కోల్పోయి వీధిన పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు లాక్కొని పొట్ట కొట్టొద్దని వేడుకున్నారు. డీఆర్ఓ మధుసూదన్ నాయక్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
- ఇదీ చూడండి : ప్రభుత్వ వాహనాలనే తనిఖీ చేసిన స్థానికులు!