అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్లిన గిరిజనులపై అటవీ శాఖ సిబ్బంది దాడి చేయడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహాం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పపూలు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్లిన గిరిజనులపై దాడి జరిగిందని.. 14 మహిళలు, 9 మంది పురుషులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భట్టి డిమాండ్ చేశారు.
అచ్చంపేట మండలం చెంచు పలుగు తండా, గుంపన్పల్లి గ్రామాలకు చెందిన గిరిజనులు శుక్రవారం బల్మూరు మండలం బాణాల అడవి ప్రాంతంలోని బండచెల్మి సమీపంలో ఇప్పపువ్వు, ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్లారని చెప్పారు. చీకటి పడటంతో ఓ చోట భోజనాలు వండుకుని అక్కడే పడుకున్నారన్నారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అటవీ అధికారులు గిరిజనులు నిద్రిస్తున్న స్థలానికి చేరుకుని కర్రలతో తీవ్రంగా చితకబాదటం అత్యంత హేయం, అమానవీయమని వ్యాఖ్యానించారు.