Tiger At Mulugu: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రాయినిగూడెం శివార్లలోని దేవుని గుట్ట అటవీ ప్రాంతంలో పులి అడుగులను స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అడుగుజాడలు పరిశీలించిన అధికారులు...పులి తిరుగుతుందని నిర్ధారించారు. దేవుని గుట్ట నుంచి లక్నవరం, తొండపాడు పొలాల మీదుగా పులి వెళ్లినట్లు తేల్చారు. సమీప గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు.
Tiger Roaming at Bhadradri: నవంబర్ మూడోవారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ అధికారులను, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లందు మండలాల ప్రజలను పులి భయభ్రాంతులకు గురిచేసింది. పాల్వంచ నుంచి టేకులపల్లి మండలంలోకి ప్రవేశించిన పులి.. అనంతరం ఇల్లందు మండలం పరిధిలోని అటవీ ప్రాంతంలో తన కదలికలను చూపించింది. రెండుసార్లు టేకులపల్లి మండలంలో ప్రత్యక్షంగా కనిపించిన పులి .. ఎక్కడ ఉందో తెలియక అటవీశాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. స్వయంగా డీఎఫ్ఓ రంజిత్ నాయక్.. అటవీ శాఖ అధికారులు సిబ్బందితో కలిపి గాలింపు చేపట్టినా పులి ఏ దిశగా వెళుతోందో గుర్తించలేకపోయారు. పూర్తిస్థాయిలో కెమెరాలు లేకపోవడం వల్ల పులి కదలికలు తెలుసుకోవడం కష్టతరంగా మారింది.