medaram Jatara 2022: ప్రతిష్ఠాత్మకమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సజావుగా సాగేందుకు పోలీసుశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీస్థాయిలో 9 వేల మంది పోలీసులను మోహరిస్తుండటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. డీజీపీ కార్యాలయంలో అనేకమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి పకడ్బందీ బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. జాతర ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
33 పార్కింగ్, 37 హోల్డింగ్ ప్రదేశాలు
జాతరకు ఈసారి 1.25 కోట్ల మంది భక్తులు వస్తారని పోలీసుశాఖ అంచనా వేసింది. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. 3.5 లక్షల వాహనాలు వచ్చే అవకాశం ఉందని, ఆర్టీసీ నడుపుతున్న 9 వేల బస్సులు దీనికి అదనమని అధికారులు లెక్కగట్టారు. భారీసంఖ్యలో వాహనాలు రానుండటంతో ట్రాఫిక్ సమస్య నివారణపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. వాహనాలను నిలిపేందుకు 33 పార్కింగ్ స్థలాలు, అవి నిండిపోతే వాహనాలను తాత్కాలికంగా నిలిపివేసి.. తర్వాత పంపించేందుకు 37 ట్రాఫిక్ హోల్డింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఏవైనా కారణాలతో వాహనాలు రోడ్డుమధ్యలో నిలిచిపోతే తొలగించేందుకు 11 క్రేన్లు, 6 టోవింగ్ వాహనాలు, 20 జేసీబీలను సిద్ధంగా ఉంచుతున్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాహనదారులకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. ట్రాఫిక్‌తోపాటు ఇతరత్రా సమాచారం తెలిపేందుకు జాతర మార్గంలోని రహదారులపై 20 డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు పెడుతున్నారు. మరోవైపు జాతరలో గొలుసులు, సెల్‌ఫోన్‌లతోపాటు పర్సుల చోరీల నివారణకు చర్యలు చేపట్టాలని, పాత నేరస్థులపై నిఘా వేసి ఉంచాలని అధికారులు ఆదేశించారు.
24 గంటలూ పర్యవేక్షణ