మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రత్యేక కార్యచరణ, వ్యూహరచన కోసం ములుగు జిల్లా వెంకటాపురంలో పోలీస్ స్టేషన్లో ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులతో తెలంగాణ అధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశం నిర్వహణపై అధికారులు పూర్తి గోప్యత పాటిస్తున్నారు. ఆఖరి నిమిషం వరకూ..ఎవరెవరు వచ్చేదన్నదీ వివరాలు తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యం.. ఛత్తీస్గఢ్ అధికారులతో డీజీపీ సమావేశం
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా.. ప్రత్యేక వ్యూహ రచనకోసం.. ములుగు జిల్లా వెంకటాపురం ఠాణాలో.. పోలీసు ఉన్నతాధికారులు సమావేశమవుతున్నారు. అంతర్గతంగా నిర్వహించే ఈ సమావేశంలో మావోయిస్టుల కార్యకలపాలను పూర్తి స్ధాయిలో నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యచరణ, అటవీ ప్రాంతంలో ప్రత్యేక బలగాలతో మరింత ముమ్మరంగా కూంబింగ్.. పోలీసుల మధ్య సమన్వయం, సహకారం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం.. తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమగ్రంగా చర్చించనున్నారు.
మావోయిస్టుల కదలికలు పెరిగిన దృష్ట్యా..వారి నిరోధానికి పూర్తి స్ధాయిలో తీసుకోవాల్సిన చర్యలపై.. పోలీసులకు.. ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేస్తారు. ఇటు ములుగు జిల్లాలో పోలీసుల కూంబింగ్ ముమ్మరమైంది. అటవీ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. కొంతకాలంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల సరిహద్దు తెలంగాణ అటవీ ప్రాంతంలోకి మావోయిస్టుల రాకపోకలు ముమ్మరమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల అటవీ ప్రాంతంలో..ఇటీవల వరుస ఎదురుకాల్పుల ఘటనలు చోటు చేసుకోవడం, పలువురు మావోయిస్టులు హతమైనా..కీలక నేతలు తప్పించుకోవడం జరిగింది.
మావోయిస్టులు..మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలనుంచి తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ములుగు జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు...మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా పోలీసులు.. రహదారులపై .ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. పోలీసుల బలగాల మోహరింపుతో... ఏజెన్సీ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.