'ప్రపంచ వారసత్వ సంపద' హోదా దక్కించుకున్న ప్రఖ్యాత రామప్ప ఆలయానికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందనే వార్తలపై సింగరేణి యాజమాన్యం స్పందించింది. కొన్ని ప్రచార మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి వార్తలు కేవలం అపోహలు, అవాస్తవాలు మాత్రమే అని యాజమాన్యం స్పష్టంచేసింది.
ఇదీచూడండి:Ramappa Temple : రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఎలా దక్కింది?
సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురంలో చేపట్టాలని భావిస్తున్న వెంకటాపురం ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని పేర్కొంది. తాజాగా యునెస్కో రామప్పను.. వారసత్వ సంపదగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని యాజమాన్యం వెల్లడించింది.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని యాజమాన్యం పేర్కొంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి.. తెలంగాణకు చెందిన ప్రపంచ వారసత్వ సంపదయిన రామప్ప గుడికి నష్టం చేకూర్చే ఎటువంటి ప్రతిపాదన చేయబోదని స్పష్టం చేసింది. దీని పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంటామని, దీనిపై ఎటువంటి అపోహలకు తావులేదని, అవాస్తవాలు నమ్మవద్దని సింగరేణి సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
అద్భుతమైన శిల్పసౌందర్యానికి, అరుదైన నిర్మాణ కౌశలానికి, వందల ఏళ్ల చరిత్రకు, కాకతీయుల వైభవానికి నెలవైన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం అరుదైన ఘనత సాధించింది. 2020 సంవత్సరానికి ప్రపంచస్థాయి కట్టడంగా యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్) గుర్తింపు పొందింది. చైనాలో జరిగిన యునెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను కల్పించినట్లు కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాన్‌విజ్ వెల్లడించారు. తెలంగాణ నుంచి మూడు చారిత్రక కట్టడాలు పోటీ పడగా అవన్నీ వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నవే. ఖిలా వరంగల్, వేయి స్తంభాల గుడి తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. రామప్ప ఆలయానికి భిన్న శైలి, శిల్పకళా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం తదితర ఎన్నో అరుదైన అర్హతలు ఉండటంతో యునెస్కో గుర్తింపును దక్కించుకుంది.
ఇదీచూడండి:RAMAPPA TEMPLE: 2020 సంవత్సరానికి ప్రపంచస్థాయి కట్టడంగా 'రామప్ప' గుర్తింపు