Hath Se Hath Jodo Yatra second day: 'హాథ్ సే హాథ్ జోడో' యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు నియోజకవర్గంలో రెండోరోజూ పాదయాత్ర కొనసాగించారు. రామప్ప ఆలయంలో రామలింగేశ్వర స్వామికి ఎమ్మెల్యే సీతక్కతో కలిసి పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. అనంతరం పాలంపేట, రామంజపూర్, చెంచు కాలనీ , నారాయణ గిరిపల్లె , బుద్ధారం చాతరాజుపల్లి మీదుగా కేశపూర్ వరకు సాగింది.
కేశపూర్‌లో వరి పొలాలు, మిర్చి తోటల్లోని రైతులు, కూలీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. పేదల ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికీ రూ.5లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ వారసత్వ సంపద కాలగర్భంలో కలిసిపోతోందని ఆరోపించారు. మార్పు కోసం యాత్ర మొదలు పెట్టామని, జనం ఆకాంక్షలను తెలుసుకొని ఎన్నికల ప్రణాళికలో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ మోడల్ అంటూ సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధుల కొనుగోలు, ప్రజాధనం గుత్తేదారులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రావాల్సిన హక్కుగా రావాల్సిన వాటి విషయంలో ఒకరిపైనొకరు నెపం నెట్టుకుంటూ బీజేపీ, బీఆర్ఎస్ కాలం వెళ్లదీస్తున్నాయని విమర్శించారు. ములుగు జిల్లాలో యాత్రను ముగించుకున్న రేవంత్‌రెడ్డి.. రెండురోజుల పాటు మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగించనున్నారు.
"ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని మేనిఫెస్టో విడుదల చేస్తాం. రామప్పను యునెస్కో గుర్తించినా.. రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రామప్పను అభివృద్ధి చేస్తాం. కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి మేలు జరగటంలేదు. పదేళ్ల నుంచి బీఆర్ఎస్, బీజేపీ అధికారంలో ఉన్నాయి. పదేళ్లలో చేయలేని పనులు ఇంకెప్పుడు చేస్తారు. ములుగు జిల్లాలో చూస్తుంటే పరిస్థితి అర్థమవుతోంది."- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
కార్యకర్తలతో రహదారులు కిటకిట : రామప్ప నుంచి రామాంజాపురం, నారాయణగిరిపల్లె, వెల్తుర్లపల్లి క్రాస్‌రోడ్డు, బుద్దారం, కేశవాపురం, నర్సాపురం, బండారుపల్లి మీదుగా యాత్ర సాగింది. వివిధ ప్రాంతాల నుంచి యాత్రకు పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో ములుగు రహదారులు కిటకిటలాడాయి. మేడారం నుంచి యాత్ర ద్వారా వేసిన అడుగు.. కేసీఆర్ సర్కార్‌ను పాతాళానికి నెడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.