కాకతీయుల కళాత్మకతకు, అద్భుత శిల్ప సంపదకు, చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలు, ఎన్నో ప్రత్యేకతలకు నెలవు రామప్ప. ఓరుగల్లు కేంద్రంగా సాగిన కాకతీయుల పాలనలో 12వ శతాబ్దంలో గణపతిదేవుని హయాంలో వారి సామంతరాజు రేచర్ల రుద్రయ్య (రుద్రుడు) దీనిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. జైతుగి అనే రాజు యుద్ధంలో గణపతిదేవుడిని ఓడించి అక్కడే ఆయన్ని బంధించాడు. రేచర్ల రుద్రుడు జైతుగితో పోరాడి గణపతిదేవుణ్ని విడిపించాడు. అందుకు బహుమానంగా రామప్ప ఆలయాన్ని ఇచ్చేందుకు క్రీ.శ 1173లో పనులు ప్రారంభించారు. 40 ఏళ్ల తర్వాత క్రీ.శ 1213లో పూర్తిచేశారు. ఆలయంలో రామలింగేశ్వరుణ్ని (శివలింగం) ప్రతిష్ఠించారు. కాకతీయులు నిర్మాణ శైలి (ఆవాసాలు, గుడి, కొలను) అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. రామప్ప గుడి కూడా అదే పద్ధతిలో నిర్మించారు. ఆలయం సమీపంలోనే విశాలమైన చెరువు, పాలంపేట గ్రామం ఉన్నాయి.
జీవం ఉట్టిపడేలా శిల్పసంపద..
జీవం ఉట్టిపడే శిల్పకళాకృతుల సౌందర్యానికి మంత్రముగ్ధులు కావాల్సిందే. స్వరాలు పలికే శిల్పాలూ ఉన్నాయి. రాతి స్తంభాల మధ్య సన్నని దారం పట్టే రంధ్రాలు ఉండటం విశేషం. ఆలయం అంతా చీకటిగా ఉన్నా గర్భగుడిలోని రామలింగేశ్వరుడిపై మాత్రం ఎప్పుడూ వెలుతురు పడుతూ ఉంటుంది. శివతాండవం, శివకళ్యాణం నాట్యరూపాలు, రామాయణ, మహాభారత, పురాణ ఇతిహాసాలు తెలిపే రమణీయమైన శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ వివిధ భంగిమలతో 12 మదనికలు, నాగిని, కోయస్త్రీ శిల్పాలు కనువిందు చేస్తాయి. అలనాటి నారీమణుల వీరత్వాన్ని తెలిపే విగ్రహాలే కాదు.. వాటి మెడలోని ఆభరణాలు సైతం స్పష్టంగా కనిపిస్తాయి. నేటికీ ఆ రాతి స్తంభాలు చెక్కుచెదరకుండా ఆకర్షిస్తుంటాయి. ఆలయ దర్శనానికి వెళ్లే మార్గాన్ని వరస కట్టిన ఏనుగు బొమ్మలు తెలియజేయడం మరో విశేషం. ఆలయం చుట్టూ ప్రహరీతో పాటు వర్షపు నీరు బయటకు వెళ్లే వ్యవస్థ ఆనాడే ఏర్పాటు చేశారంటే కాకతీయుల నాటి సాంకేతిక నైపుణ్యం అర్థం చేసుకోవచ్చు. ఎన్నో యుద్ధాలు, పిడుగులు, భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలిచింది. గర్భగుడికి అభిముఖంగా నంది విగ్రహం, కుడివైపున కామేశ్వర, ఎడమ వైపున కాటేశ్వరాలయాలు నిర్మించారు. వీటి నిర్మాణానికి ఎక్కువగా ఏనుగులనే వినియోగించారు. ఈ గుడిలో ఎన్నో సంస్కృతి, కళలు, సామాజిక అంశాలు కనిపిస్తాయి. రామాయణం, మహాభారతం, క్షీరసాగర మథనం, శివపార్వతుల కల్యాణం లాంటి పురాణ ఇతిహాసాలను శిల్పాలతో చెప్పే ప్రయత్నం చేశారు. నృత్య, యుద్ధ కళలను సైతం ఇందులో చెక్కారు. పేరిణి శివతాండవ నృత్యరూపకం ఈ గుడిలోని శిల్పాల నుంచి సేకరించినదే.
జలకళ ఉట్టిపడే సరస్సు..
ఆలయానికి కొద్ది దూరంలోనే ఉన్న రామప్ప సరస్సు నిత్యం జలకళతో ఉంటుంది. రెండు గుట్టల మధ్యన తూములు, కట్టను ఏర్పాటు చేసి ఈ సరస్సు నిర్మించారు. 2.912 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 35 అడుగుల నీటిమట్టం ఉంటుంది. చెరువుకట్ట 610 మీటర్ల పొడవుంటుంది. రెండు తూములతో సుమారు 10 వేల ఎకరాల్లో రైతులు ఏటా రెండు పంటలు పండించుకుంటున్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇదే ప్రధాన చెరువు.