ములుగు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల వేగంలో నత్తే నయం అనిపిస్తోంది. మౌలిక వసతుల లోపంతో ప్రజలు ఇబ్బందులు ఏర్పడకూడదనే ఉద్దేశంతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ఉపాధి హామీ పథకం నుంచి రావాల్సిన బిల్లులను చెల్లించడంలో అధికారులు చేస్తున్న జాప్యంతో పనులు ముందుకు సాగడంలేదు. జిల్లాలోని 174 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
వీటికి ఉపాధిహామీ పథకం ద్వారా సుమారు రూ.28.71 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో వైకుంఠధామానికి రూ.12 లక్షలు, సెగ్రిగేషన్ షెడ్డుకు రూ.2.50 లక్షలు , డంపింగ్ యార్డుకు రూ.2 లక్షలు ఖర్చుచేయాలి. తడి, పొడి చెత్తను వేరుచేసి కంపోస్టు ఎరువును తయారు చేసే సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణానికి వర్షాకాలం సమీపించినా అధికారులు మార్కింగ్‌లు ఇవ్వడంలోనే ఉన్నారు. కలెక్టర్ మందలించినా అధికారులు, ప్రజాప్రతినిధులు, గుత్తేదారులలో కదలిక లేకపోతోంది. మిషన్‌తో పనిచేసేందుకు అవకాశం ఉన్న డంపింగ్ యార్డుల పనులను వేగంగా పూర్తిచేసిన అధికారులు వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నారు.
భూసమస్యతో కొన్ని.. లాక్‌డౌన్ సాకుతో మరికొన్ని..
వెంకటాపూర్ మండలంలో డంపింగ్ యార్డుల నిర్మాణానికి మూడు గ్రామపంచాయతీలలో భూ సమస్య ఏర్పడింది. ములుగు మండలంలో తొమ్మిది, ఏటూరునాగారం మండలంలో మూడు, వాజేడు మండలంలో దూలాపురం, గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీల్లో వైకుంఠధామం పనులు ప్రారంభం కాలేదు. కొంగాల వైకుంఠధామానికి చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని వర్షం పేరుతో మధ్యలోనే నిలిపేశారు.
ఆలస్యంగా చెల్లింపులు..
వైకుంఠధామాలను నిర్మిస్తున్న గుత్తేదారులకు బిల్లులను చెల్లించడంలో ఏర్పడిన ఆలస్యంతో పనులలో వేగం లోపించింది. వైకుంఠధామాలను నిర్మించేందుకు ఇప్పటికే సుమారు రూ.6 నుంచి రూ.8లక్షల అప్పులుచేసి పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు కేవలం రూ.1.06లక్షలను మాత్రమే చెల్లించడంతో తలలు పట్టుకుంటున్నారు. వాజేడు మండలంలోని కొంగాల, నాగారం, టేకులగూడెం వైకుంఠధామాలు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పీఆర్ శాఖ నుంచి చేపట్టిన నిర్మాణాలకు ఇప్పుడిప్పుడే మార్కింగ్ ఇస్తున్నారు.
సెగ్రిగేషన్ షెడ్లు మార్కింగ్‌లకే పరిమితం