Rains in mulugu District: ములుగు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాడ్వాయి మండలంలోని అటవీ ప్రాంతంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు జలగలంచ, మొండాలతో వాగులకు వరద ఉద్ధృతి ఎక్కువ అవ్వడంతో.. జాతీయ రహదారి 163పై ఉన్న రెండు వంతెనలు కూలిపోయాయి. దీంతో ఛత్తీస్గడ్, ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా అధికారులు పస్రా గ్రామంలోనే వాహనాలను నిలిపివేశారు.
పస్రా - మేడారం మీదుగా తాడ్వాయి- ఏటూరునాగారం మీదుగా రెండు రాష్ట్రాలకు రోడ్డు మార్గం ఉంది. కానీ.. పస్రా -వెంగలాపూర్ వద్ద బాంబుల ఒర్రె లోలేవల్ వంతెన పూర్తిగా నీటిమునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జలగలంచ, మొండాలతోగు వాగుల పైనున్న వంతెన కొట్టుకు పోవడంతో అధికారులు మొరం మట్టి పోసి తాత్కాలిక రోడ్డు నిర్మిస్తున్నారు.
వెంకటాపురం మండలం ముత్తారం గ్రామ శివారులో ఉన్న ముత్తారం వాగు ఒక్కసారిగా వరద పోటెత్తింది. అదే సమయంలో.. 30 మందితో వాగు దాటి వెళ్తున్న ట్రాక్టర్ వెళ్తుండగా.. వరద నీరు చుట్టుముట్టే ప్రమాదం ఉందని గ్రహించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు. ట్రాక్టర్ నుంచి వారిని దించి ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని పెంకవాగుకు 15 రోజులుగా వరద నీరు ఉద్ధృతిగా వస్తోంది . దీంతో.. తిప్పాపురం, కలిపాక, కొత్తగుంపు, పెంకవాగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తద్వారా అక్కడి ప్రజలు అత్యవసరంగా వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇవీ చదవండి:వాగును తలపిస్తోన్న రహదారి.. మోకాళ్ల లోతు వరదతో వాహనదారుల ఇక్కట్లు
చిలుక మిస్సింగ్.. ఆచూకీ చెప్పిన వారికి రూ.85వేలు