Medaram maha jathara 2022: రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే యాభై లక్షల పైగా భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోగా.. ఈ నాలుగు రోజులు మరో 80 లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సర్కార్.. రూ.75 కోట్లు వెచ్చించి పనులు చేపట్టింది.
వనంలో ఉన్న దేవతలు.. జనం మధ్యకు వచ్చే శుభ సమయం వచ్చేసింది. జంపన్నవాగు జనసంద్రంగా మారే ఘడియలు సమీపించాయి. రేపటి నుంచే కీకారణ్యం.. జనారణ్యమై కోలాహలంగా మారనుంది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలకు ప్రతిబింబంగా నిలిచే మేడారం మహా జాతర.. బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
Medaram maha jathara 2022: రేపటి నుంచే మేడారం మహా జాతర.. సర్వం సిద్ధం కాకతీయ సేనలు.. గిరిపుత్రులను వేధిస్తుంటే.. కత్తిపట్టి కదనరంగంలో దూకి వీర మరణం పొందిన ఆడబిడ్డలే సమ్మక్క-సారలమ్మలు. వందల ఏళ్లు దాటినా వారి త్యాగానికి జనం నీరాజనాలు పలుకుతూ దేవతలుగా పూజిస్తూ.. జాతర చేస్తున్నారు. 1944 వరకూ ఆదివాసీ గిరిజనులకే పరిమితమైనా.. ఆ తర్వాత జన జాతరగా మారిపోయింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది. మాఘ మాసంలో పౌర్ణమి రోజుల్లో ప్రతి రెండేళ్లోకోసారి.. ఈ జాతర జరుగుతుంది. మండ మెలిగే పండుగతో గత బుధవారం జాతర ప్రారంభమవగా.. వన దేవతల ఆగమనంతో.. అసలైన మహా జాతర మొదలు కానుంది.
రూ.75 కోట్లతో విస్తృత ఏర్పాట్లు..
Medaram jathara: మేడారం మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు వెచ్చించి విస్తృత ఏర్పాట్లు చేసింది. 21 శాఖలకు చెందిన 40 వేల మంది జాతర ఏర్పాట్లలో రేయింబవళ్లు పాల్గొన్నారు. జంపన్నవాగు వద్ద 200 మందికి పైగా గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. 327 ప్రాంతాల్లో 6,700 మరుగుదొడ్లు నిర్మించారు. ఆర్టీసీ 3,800 బస్సుల్లో 21 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 10 వేల మందికి పైగా పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కొవిడ్ దృష్ట్యా లక్ష వరకు ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచారు. 350కి పైగా సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలు, రెండు కమాండ్ కంట్రోల్ రూంలతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. భక్తులకు ఉల్లాసాన్ని పంచేలా హెలీరైడ్, హాట్ ఎయిర్ బెలూన్, పారా సెయిలింగ్ రైడ్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ పలుమార్లు సమీక్షించి.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న అమ్మవార్లను దర్శించుకోనున్నారు.
నెల ముందు నుంచే మొదలైన సందడి..
జాతర తొలిరోజు.. కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం కాగా.. రెండో రోజు.. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం ఉంటుంది. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన వన వేడుకకు కోటిమందికి పైగా భక్తులు వస్తారు. భక్తిభావంతో అమ్మలను దర్శించుకుంటారు. ఈసారి జాతరకు నెల ముందు నుంచే.. మేడారంలో సందడి మొదలైంది. ఇప్పటికే 50 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నారు. లక్నవరం జలాలు విడుదల చేయడంతో.. జంపన్న వాగుకు జళకళ వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల బాట పడుతున్నారు. పిల్లాపాపాలను సల్లంగా సూడు తల్లీ అంటూ అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇదీ చూడండి: మేడారం మహాజాతర.. గిరిజనుల మహా కుంభమేళా..!