Medaram Jatara 2022:గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే పండగలు, జాతరలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తెలంగాణలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, రాష్ట్ర పండగగా ఖ్యాతి గడించిన ఈ జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఇవాల్టి నుంచి 19 వరకు నాలుగు రోజుల పాటు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కుగ్రామం మేడారం ఈ జన జాతరకు వేదిక కానుంది. సాధారణ సమయంలో తక్కువ మంది భక్తులతో ఉండే ఈ ప్రదేశం.. జాతర సమయంలో జనారణ్యాన్ని తలపిస్తుంది.
జాతరలో కిటకిటలాడుతోన్న భక్తులు.. అమ్మల వీరోచిత పోరాటం..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం జాతర ప్రారంభం వెనుక ఓ చరిత్రాత్మక కథ ప్రచారంలో ఉంది. 13వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు కాకతీయుల రాజుగా ఉన్న సమయంలో మేడారంను కాకతీయుల సామంతుడైన పగిడిద్ద రాజు పరిపాలించేవాడు. ఆయన భార్యే సమ్మక్క. ఆమె పుట్టుక, ఈ జాతర నేపథ్యం వెనుక ఓ కథ దాగుంది. మేడారానికి చెందిన కొందరు కోయదొరలు గోదావరీ తీరంలోని అడవికి వేటకు వెళ్లినప్పుడు అక్కడ ఒక పాప పులులతో ఆడుకోవడం గమనించారు. వారు ఆ పాపను తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆమెకు సమ్మక్క అని నామకరణం చేశారట. ఎప్పుడైతే ఆ పాప గ్రామంలోకి అడుగుపెట్టిందో అప్పటినుంచే అక్కడ సకల శుభాలు సమకూరినట్లు, పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లవడం, సంతానం లేనివారికి పిల్లలు పుట్టడం వంటివి జరగడంతో ఆమెను వారంతా వనదేవతగా కొలిచేవారు. తదనంతర కాలంలో సమ్మక్క పగిడిద్ద రాజును వివాహం చేసుకోవడంతో ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లలు జన్మించారు.
అప్పట్లో కాకతీయులకు సామంతులుగా ఉండి కోయరాజులు మేడారం పరగణాలను పాలించే సమయంలో ఆ ప్రాంతం వరుసగా నాలుగేళ్ల పాటు కరవుకాటకాలకు గురైంది. అయినా సరే ప్రతాపరుద్రుడు పన్ను కట్టాల్సిందేనని ప్రజల్ని హెచ్చరించడంతో కోయదొరలు దాన్ని వ్యతిరేకించారు. దాంతో కాకతీయ రాజు వారిపై యుద్ధం ప్రకటించడంతో పగిడిద్ద రాజు.. తన సంతానం నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులతో కలిసి కాకతీయ సైన్యంతో పోరాడి వీరమరణం పొందుతారు. తన భర్త, బిడ్డల మరణ వార్త విన్న సమ్మక్క యుద్ధంలో వీరవనితలా పోరాడుతుంది. ఆమె చేతిలో ఓడిపోక తప్పదనుకున్న ఓ సైనికుడు ఆమెను దొంగచాటుగా బల్లెంతో పొడవడంతో, తీవ్రంగా గాయపడ్డ ఆమె.. ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టవైపు వెళ్లి దాని చుట్టూ తిరిగి అదృశ్యమవుతుందట.
సమ్మక్క- సారక్కలను పూజిస్తూ.. కోయదొరలు ఆమెకోసం వెతుక్కుంటూ అక్కడికి వెళ్తే.. ఆ గుట్టమీద ఓ నెమలి నార చెట్టు దగ్గరున్న పుట్ట వద్ద ఓ కుంకుమ భరిణె కనిపించిదట. అంతలోనే 'కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కాదని, ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలని, ఆ స్థలంలో గద్దె కట్టించి, రెండేళ్లకోసారి ఉత్సవం జరిపితే భక్తుల కోరికలు నెరవేరతాయ'ని ఆకాశవాణి మాటలు వినిపించడంతో ఆ కుంకుమ భరిణెనే అమ్మ ప్రతిరూపంగా భావించి దాంతోనే వెనుదిరిగారట కోయదొరలు. ఆపై అమ్మ యుద్ధరీతిని, యుద్ధ సమయంలో తన సైనికులు చేసిన తప్పిదాల్ని గ్రహించిన ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారి, ఈ జాతరను ప్రారంభించినట్లు తెలుస్తోంది. సమ్మక్కతో పాటు యుద్ధంలో పోరాడి వీర మరణం పొందిన సారలమ్మకు ముందుగా మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి గ్రామంలో గుడి కట్టించి పూజించేవారట. ఆ తర్వాతి కాలంలో మేడారంలో సమ్మక్క ఉత్సవాలు వైభవోపేతంగా జరగడంతో 1960 తర్వాత సారలమ్మకు కూడా సమ్మక్క గద్దె పక్కనే గద్దె కట్టించి పూజిస్తున్నారట. ఇలా అప్పట్నుంచి మేడారం జాతరగా, సమ్మక్క-సారలమ్మ జాతరగా ప్రసిద్ధి పొందిందీ గిరిజన జాతర.
వెదురుకర్రలే ఉత్సవ మూర్తులుగా..
సాధారణంగా మనం వెళ్లే దేవాలయాల్లో, జాతర్లలో ఉత్సవ మూర్తుల్ని దర్శించుకోవడం సహజమే. అయితే ఈ సమ్మక్క-సారలమ్మ జాతరలో వెదురుకర్రలు, కుంకుమ భరిణెలనే ఉత్సవ మూర్తులుగా, అమ్మల ప్రతిరూపాలుగా భావించడం ఇక్కడి ప్రత్యేకత. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండగలో తొలిరోజున సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు గద్దెల పైకి చేరుకుంటారు. ఈ క్రమంలో సారలమ్మను కన్నెపల్లి గ్రామం నుంచి మేళతాళాల నడుమ వూరేగింపుగా తీసుకొస్తారు. ఆ సమయంలో భక్తులు కోరికలు కోరుతూ సాష్టాంగ నమస్కారం చేస్తుంటే పూజారి వారిపై నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఈ ఘట్టంతో వారి జీవితం ధన్యమైనట్లుగా భావిస్తారు భక్తులు. జాతరకు రెండు రోజుల ముందే కొత్తగూడ మండలం, పోనుగుండ్లలోని మరో పూజారి బృందం సమ్మక్క భర్త పగిడిద్ద రాజుతో బయల్దేరుతుంది. ఇక చివరగా సమ్మక్కను కుంకుమ భరిణెగా భావించి, చిలుకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు వెదురు బొంగుతో చేసిన మొంటె (చిన్న చాట)లో గిరిజనులు తయారుచేసిన కుంకుమ వేసి, దాన్ని చిన్న పిల్లాడి నెత్తిన పెట్టి తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్టిస్తారు. ఆ సమయంలో అధికారిక లాంఛనాలతో పది రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఈ సమయంలో కోర్కెలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరతాయనేది భక్తుల నమ్మకం. ఇలా గద్దెలపై కొలువుదీరిన అమ్మలను దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడుతుంటారు.
మొక్కులు సమర్పించుకునే స్థలం.. నిలువెత్తు బంగారం సమర్పిస్తూ..
నిష్కల్మషమైన మనసుతో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతోంది మేడారం. అమ్మలు తమ కోర్కెలు నెరవేర్చడంతో పాటు తమ జీవితంలోని కష్టాలను తొలగించి సకల శుభాలనూ అందిస్తారని భక్తుల అపార విశ్వాసం. అయితే ఇందుకు సమ్మక్క-సారలమ్మలను భక్తితో సేవించడం తప్పనిసరి. మేడారం జాతరలో భాగంగా ముందుగా జాతరకు వెళ్లే దారిలో గట్టమ్మ తల్లి దేవాలయం వద్ద ఆగి ఆ అమ్మను దర్శించుకుంటారు భక్తులు. ఇలా చేస్తే తమ యాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోతుందనేది భక్తుల నమ్మకం. ఆ తర్వాత మేడారం చేరుకొని అక్కడి జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించిన భక్తులు.. ఆపై అక్కడే వాగుకు పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు.
తాము కోరుకున్న కోర్కెలు నెరవేర్చితే ఒడిబియ్యం (కొత్తబట్టలో పసుపు-కుంకుమ కలిపిన బియ్యంలో ఎండుకొబ్బరి, రెండు రవిక ముక్కలు, రెండు పోకవక్కలు, ఖర్జూరాలు వేసి నడుముకి కట్టుకుంటారు) పోస్తామని, ఎదురుకోళ్లు (కోళ్లను గాల్లోకి ఎగరేయడం) చేస్తామని, బండ్లు కట్టుకువస్తామని, అమ్మవారి రూపంలో వస్తామని, గాజులు, రవికెలు సమర్పిస్తామని, లసిందేవమ్మ మొక్కు (గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకొని వచ్చి దాన్ని అమ్మకు సమర్పించడం), నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడం, అంతకు తూగే బెల్లానికి ఇంటి దగ్గరే పూజలు చేసి తీసుకురావడం, తలనీలాలు సమర్పించడం, కోడెను సమర్పించడం.. ఇలా తాము మొక్కుకున్న విధానాన్ని బట్టి ఆ మొక్కుల్ని చెల్లిస్తుంటారు భక్తులు. ఇలా గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ వేడుకలో చెంచులు, వడ్డెరలు, కోయలు, భిల్లులు, సవరలు, గోండులు.. తదితర గిరిజన తెగలతో పాటు మహా నగరవాసులు, దేశవిదేశీయులు పాల్గొని అమ్మల్ని మనసారా సేవించుకుంటారు.
వనదేవతలు తమ కడుపున పుట్టాలని!
మేడారం మహా జాతరలో నెలలు నిండిన గర్భిణులూ అమ్మవార్లను దర్శించుకునే సంప్రదాయం ఉంది. సమ్మక్క, సారలమ్మలపై ఉన్న భక్తి భావంతో కొందరు మేడారంలోనే ప్రసవం కావాలని కోరుకొని మరీ వస్తుంటారు. వీరిలో కొందరు జాతరలోనే బిడ్డలకు జన్మనిస్తారు. ఆ పిల్లలపై అమ్మవార్ల కృప ఉంటుందని, పిల్లలకు మేడారంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని భక్తులు విశ్వసిస్తారు. పైగా పిల్లలు పుట్టగానే వెళ్లిపోకుండా కొందరు పురుడు వరకు ఆగుతుంటారు. నామకరణం మాత్రం వెంటనే చేస్తారు. ఆడపిల్లలు జన్మిస్తే సమ్మక్క లేదా సారలమ్మ అని, అబ్బాయి పుడితే జంపన్న అనే పేర్లు పెట్టుకొని కన్నవారు మురిసిపోవడం ఆనవాయితీగా వస్తోంది.
అమ్మవార్ల గద్దెల స్వాగత తోరణం.. ఇదీ చూడండి: