Gudigunta pond land kabja in Mulugu District : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్‌లో గుడికుంట శిఖం భూమి కబ్జాకు గురవుతోంది. హైదరాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి... కోట్ల విలువైన స్థలాన్ని చెరపట్టేందుకు రంగంలోకి దిగాడు. తన అనుచరుల పేరిట తప్పుడు రికార్డులు సృష్టించి... శిఖం భూమిలో మట్టిని నింపేస్తున్నారు. ఇదేంటని అడిగితే బెదిరించడమే కాకుండా... అధికారుల అండతో బోర్లు సైతం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు అడ్డుకున్నారు. దాదాపు 450 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువును కాపాడాలని అన్నదాతలు కోరుతున్నారు.
"ఈ గ్రామానికి సంబంధించి 30 సంవత్సరాం క్రితం ఈ చెరువును తవ్వారు. కబ్జా దారులు మా భూములను, చెరువును కబ్జా చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ చెరువు 450 ఎకరాలను నీరును అందిస్తుంది. రెవెన్యూ వాళ్ల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఎవరో వచ్చి చెరువును కూడుపుతున్నారు. అప్పట్లో పరిహారం అందించాక రెవెన్యూ అధికారులు రికార్డులు తొలగించలేదు. అందువల్ల ఇప్పుడు వారు వచ్చి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు." - రైతులు
163వ జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం వల్ల స్థిరాస్తి వ్యాపారులు భూదందాకు తెరలేపారు. రికార్డుల్లో లొసుగులను ఆసరాగా చేసుకుని... ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నా నీటిపారుదల, రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆయకట్టుదారులు ఆరోపిస్తున్నారు. చెరువు శిఖం భూముల్లో వెంచర్ చేసేందుకు మట్టి పోసి చదును చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడని వాపోతున్నారు.