ములుగు జిల్లా కొత్తూరు గ్రామానికి సమీపంలోని అడవుల్లోని దేవుని గుట్టపై అద్భుత కళాకృతులతో ఓ ఆలయం ఉంది. దానినే దేవునిగుట్ట ఆలయంగా పిలుస్తున్నారు. ఈ ఆలయం అతిపురాతనమైనది. సుమారు 1500 ఏళ్ల క్రితం కట్టినట్లుగా చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. దీని నిర్మాణ శైలి దేశంలోనే మరెక్కడా లేదని అంటారు. ఆలయ నిర్మాణ శైలి అచ్చం... ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా పేరు గాంచిన అంగ్ కోర్ వాట్‌ను పోలి ఉన్నట్లు(Devuni Gutta temple is similar to the Angkor Wat) పరిశోధకులు గుర్తించారు. ఈ ఆలయ గోడలపై ఇసుక రాతి పలకలపై చెక్కిన 1600 పైచిలుకు శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. ఈ ఆలయంలోని శివుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తాడు. బుద్ధుని శిల్పాలు సైతం ఇక్కడ ఉన్నాయి. ఆలయం సమీపంలోనే ఓ కోనేరు ఉంది. ఓ చెరువు సైతం ఈ ఆలయ సమీపంలో ఉంటుంది. ఆ చెరువు నుంచి దిగువకు జాలువారే జలదృశ్యాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ జలపాతమే గుట్టకు వెళ్లే మార్గాన్ని సూచిస్తోంది. ఆ చెరువు నుంచి వెళ్లే నీరంతా లక్నవరం సరస్సులోకి వెళ్తుంది.
ఆలయ చరిత్ర...
ఆలయ నిర్మాణ శైలని బట్టి ఇది క్రీస్తు శకం 6 లేదా 7వ శతాబ్దానికి చెందిన కట్టడంగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. అంగ్ కోర్ వాట్ దేవాలయం(Angkor Wat temple) 12వ శతాబ్దంలో నిర్మించారు. అంటే అంతకంటే ముందే అలాంటి నిర్మాణం తెలంగాణలో జరిగిందని దేవుని గుట్ట ఆలయం(Devuni Gutta Temple) నిరూపించింది. అంతేకాదు దేవుని గుట్ట ఆలయం భారతదేశంలోనే సాటిలేని నిర్మాణం. ఈ ఆలయ శాసనం లభించకపోవడంతో దీనిని ఎప్పుడు నిర్మించారో స్పష్టమైన ఆధారాలు లేవు. విష్ణు కుండినుల కాలం నాటి ఆలయ నిర్మాణ పద్ధతులు ఈ ఆలయ నిర్మాణానికి సారుప్యత ఉండటంతో వారి హయాంలోనే... ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తున్నారు. ఈ ఆలయం ప్రత్యేకతలను చరిత్ర పరిశోధకుడు ఆరవింద్ ఆర్య ద్వారా తెలుసుకుని.. జర్మనీకి చెందిన కొరీనా వెస్సెల్స్, ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ ఆడం హార్డీలు ఐదేళ్ల క్రితం ఆలయాన్ని సందర్శించారు. నిర్మాణశైలిని చూసి మంత్ర ముగ్ధులయ్యారు.