గద్దెల వద్ద జనం... మేడారంకు దారి తీసే రహదారులపైనా అంతే జనం.. జంపన్నవాగు వద్దా జనం. మూడు రోజులు అయినా ఎక్కడా తగ్గని రద్దీ. మేడారం పరిసరాలు ఇవాళ కూడా జనసంద్రంగానే మారాయి. అందరికీ అభయ ప్రదానం చేసేందుకు... అడివిని వీడి వచ్చిన జన దేవతలకు... భక్తులు నీరాజనాలు పలికారు. రాత్రి, పగలన్న తేడా లేకుండా... లక్షలాదిగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రముఖులు వచ్చినప్పుడు మినహా.... గత రాత్రి నుంచి నిరంతరాయంగా దర్శనాలు జరుగుతున్నా భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు.
బంగారం సమర్పించిన సీఎం
మేడారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేసి... వనదేవతలను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, జిల్లా కలెక్టర్ కర్ణన్ ఘన స్వాగతం పలికారు. తులాభారం వద్ద 51 కిలోల బంగారాన్ని సీఎం సమర్పించి... మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బుట్టలో పట్టువస్త్రాలు, బంగారం, పూజా సామగ్రిని నెత్తిన పెట్టుకుని... అమ్మల చెంతకు వచ్చారు. ముందుగా సమ్మక్క గద్దెల వద్దకెళ్లి పూజలు చేసి ఆ తరువాత మిగతా దేవతలనూ దర్శించుకున్నారు.