BRS Leaders Complaint against Revanth Reddy : ప్రగతిభవన్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ములుగు బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే యాత్రను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. నిన్న ములుగులో పాదయాత్రలో భాగంగా తెలంగాణ ప్రగతికి చిహ్నమైన ప్రగతిభవన్‌ను గ్రానైట్స్‌తో పేల్చేయాలంటూ రేవంత్‌రెడ్డి సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Revanth Reddy Padayatra in mulugu : ప్రగతిభవన్‌పై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు, శవయాత్రలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఒక పార్లమెంట్ సభ్యుడుగా ఉండి పరిపాలనా భవనం, తెలంగాణ ప్రగతికి చిహ్నమైన "ప్రగతిభవన్" ను గ్రానైట్స్‌తో పేల్చేయమనటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
నాడు నక్సలిజాన్ని నిషేధించింది కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ నేడు నక్సలైట్లతో ప్రగతిభవన్‌ను గ్రానైట్‌తో పేల్చేయండి.. అనడాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థిస్తారా..? అని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిపై పీడీ యాక్ట్ క్రింద కేసు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నమని తెలిపారు. ఇది పునరావృతమైతే పాదయాత్రను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.