తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతానికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతానికి... ఈసారి కాస్త ఆలస్యంగా జలకళ వచ్చింది. ప్రధానంగా ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్లో వర్షాలు పడుతుండటం వల్ల... జలధారలు కనువిందు చేస్తున్నాయి.
కొండకోనల్లనుంచి వడివడిగా పరుగులు తీస్తోన్న జలధారలు... సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గత రెండు వారాల నుంచి బొగతకు పర్యటకుల తాకిడి పెరిగింది. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి కూడా పర్యటకులు వస్తున్నారు. కుటుంబ సమేతంగా, స్నేహితులతో వచ్చిన వారంతా... బొగత అందాలను ఆస్వాదిస్తున్నారు. బొగత జలాల్లో జలకాలాడుతూ ఉల్లాసంగా గడిపేస్తున్నారు.