ప్రముఖ హీరోయిన్లు తన ప్రియురాళ్లని.. పలు పెద్ద సినిమాలకు తనే మొదటి హీరోనని.. రాజకీయాలు చేసి తప్పించారంటూ ఇంటర్వ్యూలు ఇచ్చిన సునిశిత్‌ను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 17న ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలీసులకు కించపరిచాడంటూ ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై కీసర పోలీసులు చర్యలు తీసుకున్నారు.
కీసర రాంపల్లికి చెందిన సునిశిత్ ఇబ్రహీంపట్నంలో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. అనంతరం ఓ కళాశాలలో సహాయ ఆచార్యుడిగా పనిచేశాడు. ఆ సమయంలో విద్యార్థినులకు అసభ్య సందేశాలు పంపిన కేసులో స్థానిక ఠాణాలో రెండు కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. ఫలితంగా ఉద్యోగం పోయిందని పేర్కొన్నారు. అనంతరం పలువురు హీరోలు, కథానాయికలపై తప్పుడు ప్రచారం చేసినట్లు తెలిపారు. గతంలో నటి లావణ్య త్రిపాఠి ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.