వానొచ్చిందంటే చాలు.. వరద సమస్య ఒకెత్తయితే.. డ్రైనేజీ సమస్య మరింత అవస్థలకు గురిచేస్తోందని మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ సాయినగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు.. డ్రైనేజీలో కలిసి కాలనీ అంతా దుర్గంధం వస్తోందని వాపోతున్నారు. సుమారు రెండేళ్ల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నామని.. ఎవరిని కలిసినా హమీలిస్తున్నారే తప్ప.. సమస్యలను పరిష్కరించడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు.
ఆరు నెలల క్రితం ఈ కాలనీలో డ్రైనేజీ మరమ్మతులు చేస్తామని చెప్పి.. ఎక్కడికక్కడ మట్టి తవ్వి వదిలేశారని.. అప్పటి నుంచి డ్రైనేజీ సమస్య మరింత ఎక్కువయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రులకు క్యూ కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోవడం లేదని.. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
ఆరు నెలల నుంచి చాలా ఇబ్బందున్నది. రానికి.. పోనికి ఇబ్బందైతున్నది. డ్రైనేజీ సమస్యను త్వరగా పరిష్కరించాలి.
- రాజు, సాయినగర్ కాలనీ
పెద్ద మోరీలు వేస్తామని చెప్పి.. ఆరు నెలల కింద తవ్వి వదిలేశారు. ఇంటి ముంగటే నీళ్లున్నాయి. ఇంటికి ఎవరూ రాకుండా అయిపోయింది. మేం ఎట్లా బతకాలి. - రజిత, సాయినగర్ కాలనీ