ఇది మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని జవహర్‌నగర్. 350 ఎకరాల గ్రామకంఠానికి తోడు 750 ఎకరాల ప్రభుత్వ భూమిలో విస్తరించి ఉంది. 18 వేల ఆవాసాలున్నాయి. కేవలం గ్రామకంఠం పరిధిలోని గృహాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది. 2014-16 మధ్య మొదటిసారి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసినా.. భూములపై స్పష్టత లేకపోవడంతో చేపట్టలేదు. పైగా చెల్లించిన రూ.7.50 కోట్ల మొత్తాన్నీ వెనక్కు ఇవ్వలేదు. ఈ ఏడాది మార్చిలోనూ కొందరు దరఖాస్తు చేశారు.
ఇక్కడ నోటరీయే హక్కు పత్రం..నగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని నగర పాలక, పురపాలికల్లో పెద్ద ఎత్తున నోటరీ పత్రాలపైనే లావాదేవీలు సాగుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారు ఒక్కో కాలనీలో వేల సంఖ్యలో ఉన్నారు. వారికి స్థలాలపై ఎలాంటి హక్కులు లేవు. గ్రామకంఠం పరిధిలోని గృహాలకు జారీచేసిన ఇంటి నంబర్లు, విద్యుత్తు, నాలా కనెక్షన్లను ఈ కాలనీల్లోనూ ఇస్తున్నారు. జగద్గిరిగుట్ట, రోడామిస్త్రీనగర్, శ్రీరాంనగర్, శ్రీనివాస్‌నగర్, లెనిన్‌నగర్, గిరినగర్, గాజులరామారంతో పాటు 35 కాలనీల్లోని 50 వేల నివాసాల్లో 25 వేల ఇళ్లకు హక్కులు రాలేదని అంచనాలున్నాయి. దుండిగల్, కొంపల్లి పురపాలక సంఘాలు, నిజాంపేట నగరపాలక సంస్థ పరిధిలోనూ 17 వేల ఇళ్లలో సగం వరకు హక్కులు లేనివే.
సింగరేణి ప్రాంతాల్లో రుసుం సమస్య..సింగరేణి సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికీ అనేక సమస్యలున్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు, రామగుండం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లో 2006, 08లలో క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2017, 18లలోనూ పలు జీవోల ద్వారా ఈ అవకాశాన్ని పొడిగించింది. కుటుంబ వివాదాలు, నల్లా, విద్యుత్తు కనెక్షన్ల ధ్రువీకరణ పత్రాలు లేనివారు దరఖాస్తు చేయలేకపోయారు. సింగరేణి ప్రాంతం వరకు ఇచ్చిన ప్రత్యేక జీవోలతో క్రమబద్ధీకరణకు చాలా తక్కువ రుసుం ఉంటుందని, జీవోలు 58, 59ల కింద ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 1970 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లకు హక్కుల కల్పన క్లిష్టంగా మారింది. ఏజెన్సీ చట్టం అమల్లోకి రాకముందు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, వారి తదనంతరం వారసులకు మాత్రమే హక్కులు కొనసాగుతున్నాయి. గిరిజనేతరులకు చెందిన భూములకు రిజిస్ట్రేషన్లు లేవు. తరాల నుంచి నివాసం ఉంటున్న తమకు హక్కులు కల్పించాలని వారు కోరుతున్నారు. పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, భూపాలపల్లి, ఏటూరునాగారం, నిర్మల్, ఉట్నూరు తదితర పట్టణాల్లోనూ ఈ సమస్య ఉంది.