కరోనా టీకా కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వ్యాక్సిన్ కోసం గంటల తరబడి వేచిచూస్తున్నారు. అయినా కొందరికీ టీకా దొరకడం లేదు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ వ్యాక్సినేషన్ కేంద్రంలో రోజుకు 20 మందికి మాత్రమే ఇస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీకా అయిపోయిందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. ఉదయం నుంచి గంటల తరబడి వేచిచూసి... వెనుదిరుగుతున్నామని వాపోయారు. అధికారులు, సిబ్బంది కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఉదయం ఆరు గంటల నుంచి వచ్చి ఎదురుచూస్తున్నాం. చివరకు వ్యాక్సిన్ అయిపోయిందని నిర్లక్ష్యంగా చెబుతున్నారు. స్లాట్ బుక్ చేసుకొనే కదా వచ్చాం. డోసుల గురించి సమాచారం ఉండదా? మూడు రోజుల నుంచి టీకా కేంద్రాలకు వస్తున్నా వ్యాక్సిన్ లేదని చెబుతున్నారు. టీకా వేసినట్లు మెసేజ్ వచ్చింది. కానీ వ్యాక్సిన్ ఇవ్వలేదు. మేం ఎవరిని అడగాలి? అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
-స్థానికులు
ఖమ్మంలో వ్యాక్సిన్ ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. టీకా వేసుకుంటే రక్షణ సంగతి అటుంచితే.. లేని రోగాలు వచ్చేలా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. నగరం మొత్తం ఒకే చోట వ్యాక్సిన్ వేస్తుండటంతో టీకా కోసం భారీగా జనం ఎగబడ్డారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రెండో డోసు మాత్రమే వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గంటల తరబడి లైన్లల్లో నిలబడినా... టీకా దొరుకుతుందో లేదో అని వాపోతున్నారు. ఎవరూ భౌతికదూరం పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.