ఈ సీజన్లో మొక్కజొన్న పంటల సాగు కాకుండా వాణిజ్య పంటలు వేసి మంచి లాభాలు పొందవచ్చని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కందులు, పత్తి వంటి పంటలు వేసుకుంటే మంచిదని ఆయన సూచించారు. మేడ్చల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో వానాకాలం నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మేడ్చల్ మండలంలో 50 క్లస్టర్లలో 3200 మంది రైతులు ఉన్నారని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతం ఉన్నా ఇంకా కొంత మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు.
'గ్రామాల్లో సర్పంచ్లకు పంటల లెక్కలు తెలియాలి'
రైతులను రాజులు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో నియంత్రిత సాగు విధానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
గ్రామాల్లో సర్పంచ్లకు స్థానిక పంటల గురించి అవగాహన ఉండాలన్నారు. రైతులకు నూతన విధానాల గురించి తెలపాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, మార్కెట్ కమిటి ఛైర్మన్ సునీత లక్ష్మి, జిల్లా గ్రంథాలయం సంస్థ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :''ఆ డాక్టర్లపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదు?''