తెలంగాణలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా శ్రమించాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ శివారు కొంపల్లిలో టీపీసీసీ ఆధ్వర్యంలో జిల్లా, బ్లాక్, మండల అధ్యక్షులకు డిజిటల్ సభ్యత్వ నమోదుపై రెండు రోజులపాటు జరిగే రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాలకు మీడియాకెక్కడం సరికాదని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే 80 లక్షల ఓట్లు, 78 ఎమ్మెల్యే సీట్లు సాధించాలని.. అందుకు 30లక్షల సభ్యత్వాలు చేయించాలన్నారు. డిసెంబరు 1లోపు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక నాయకుడిని ఎంచుకోవాలన్నారు.