TS High court about Medchal ITI : మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే
12:33 December 15
మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే
TS High court about Medchal ITI : మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఐటీఐ తరలింపును అడ్డుకోవాలని కోరుతూ 132 మంది విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు లేఖ రాశారు. ఐటీఐని అక్కడి నుంచి దూరంగా తరలించి... ఆ భూమిని కంపెనీలకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని లేఖలో విద్యార్థులు ఆరోపించారు. దూరంగా తరలిస్తే ప్రయాణానికి ఇబ్బంది పడతామని వాపోయారు. ఎక్కువ మంది విద్యార్థులు స్థానికంగా పరిశ్రమల్లో పార్ట్ టైం ఉద్యోగులు చేస్తూ చదువుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.
మధ్యంతర ఉత్తర్వులు
విద్యార్థుల లేఖను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన సీజే ధర్మాసనం... ఇవాళ విచారణ చేపట్టింది. ఐటీఐ తరలిస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రయాణ ఛార్జీలు భరించలేరని.. పార్ట్ టైం ఉద్యోగాలు కూడా కోల్పోతారని పేర్కొంది. పూర్తి వివరాలతో 8 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తరలింపు ప్రక్రియను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:Boy died in Mulugu: నీళ్లు అనుకొని పురుగులమందు తాగి.. బాలుడు మృతి