Rain in hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావంతో సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లా పరిధిలో భారీవర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలోని బాలా నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కొంపల్లి, సుచిత్ర, దుండిగల్, కుషాయిగూడ, దమ్మాయిగూడ, చర్లపల్లిలో వర్షం పడింది. మల్కాజిగిరి పరిసరాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో నాలలు పొంగి రోడ్లన్నీ జలమయమయ్యాయి, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అవసరమైతే తప్ప బయటికిరావొద్దు: ఇవాళ రాత్రి కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటికిరావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్‌గా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే మధ్యాహ్నం నుంచి కురుస్తున్నవానతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, అల్వాల్, నెరేడ్‌మెట్‌లలో ఎక్కువ వర్షప్రభావం చూపింది.
సుమారు గంటకు పైగా కురిసిన భారీవర్షంతో నాలాలు నిండిపోయి నీరంతా రహదారులపైకి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. శేరిలింగంపల్లి, అల్వాల్, నాగారం, మల్కాజిగిరిలోనూ జోరు వాన కురిసింది. కాప్రా, కుషాయిగూడ, తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లో భారీ వర్షం పడింది.