గురుకులాల్లో లలిత కళలు... విద్యార్థుల భవితకు బంగారు బాటలు చిన్న వయస్సులోనే పిల్లల్లోని కళా నైపుణ్యాలను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహించేందుకు 2017లో మేడ్చల్ జిల్లా రాంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రత్యేకంగా లలితకళ పాఠశాలగా మార్చారు. కళలంటే అమితాసక్తి ఉండి... వాటిని పొందలేని పేద పిల్లలకు నాలుగేళ్లు ఉచితంగా శిక్షణ ఇచ్చి ధ్రువపత్రం అందజేయడం ఈ పాఠశాల ప్రధాన లక్ష్యం.
ఉదయం పాఠాలు... మధ్యాహ్నం లలిత కళలు
సంగీతం, నృత్యం, రంగస్థల నటన, పెయింటింగ్, డ్రాయింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. జానపద, కర్ణాటక సంగీతంతో పాటు తబల, మృదంగం, వయోలిన్, గిటార్, కీబోర్డు నేర్పిస్తున్నారు. కూచిపూడి, కథక్‌లలో శిక్షణ ఇస్తున్నారు. లలిత కళల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన నిపుణులు ఇక్కడ బోధిస్తున్నారు. ఉదయం పాఠ్యాంశాల బోధన జరగనుండగా.... మధ్యాహ్నం లలిత కళల్లో శిక్షణ ఇస్తుంటారు.
ఇక్కడ చేరాలంటే
ఈ పాఠశాలలో చేరాలంటే ఇదివరకే గురుకుల ప్రవేశ పరీక్ష రాసి రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో చేరి ఉండాలి. లలిత కళలపై ఆసక్తి ఉన్న వారు నైపుణ్య పరీక్షలో ఎంపికైతే ఆరో తరగతిలో చేర్చుకుని అకాడమిక్స్‌తో పాటు లలితకళల్లోనూ తొమ్మిదో తరగతి వరకు శిక్షణ ఇస్తారు.
జాతీయ స్థాయిలో సత్తా
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పోటీలు జరిగినా ఈ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటుతున్నారు. గిటార్, కీ బోర్డు సాధనలో ట్రినిట్ కాలేజ్ ఆఫ్ లండన్ నిర్వహించిన పరీక్షలో 19 మంది విద్యార్థులు గ్రేడ్ -1 ఉత్తీర్ణత సాధించారు. థియేటర్ ఆర్ట్స్ విద్యార్థులు రవీంద్రభారతిలో ఇప్పటికే అనేక నాటక ప్రదర్శనలిచ్చారు. పలు ప్రభుత్వ ప్రకటనలు, లఘు చిత్రాల్లో నటించి ప్రశంసలందుకుంటున్నారు. ఇంటర్ సొసైటీ పోటీల్లో 28 విభాగాల్లో ఈ లలిత కళల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి పాఠశాలను బహుమతులతో నింపేశారు.
సర్వత్రా హర్షం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో.... ఫైన్ ఆర్ట్స్‌లో ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులను ఒకేచోట చేర్చి సమాజానికి అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంకల్పించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న సంక్షేమ గురుకుల పాఠశాలల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.