దుర్గమ్మ జాతరకు సౌకర్యాలేవీ ?? - TEMPLE ADMINISTRATIOBN
జాతరంటే అందరికీ పండగే. కానీ పనులు కేటాయించి కాసులు దండుకోవచ్చనే ఆలోచన కొంతమంది అధికారులదైతే... నాసిరకంగా చేసి డబ్బులు మిగుల్చుకోవచ్చని గుత్తేదారులది ఆశ. వెరసి ఏడుపాయల వనదుర్గా భవానీ జాతరకు కోట్లలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నా... సౌకర్యాలు మాత్రం అరకొరగానే చేపడుతున్నారు.
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జాతర జరుగుతుంది. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఏర్పాట్లకు ప్రభుత్వం కోటిన్నర నిధులు విడుదల చేసింది. జాతరకు సమయం దగ్గర పడుతుండగా హడావిడిగా నాసిరకం పనులు చేసి డబ్బులు దండుకునేందుకు గుత్తేదారులకు అక్రమ బిల్లులు చెల్లిస్తున్నారు.
పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే నామినేషన్ పద్ధతిని అనుసరిస్తున్నామని ఆలయ పాలకమండలి అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సులభంగా చేరుకునేలా మూడు వంతెనలు నిర్మిస్తున్నారు. ఆలయానికి సమీపంలో శాశ్వతంగా మరుగుదొడ్లను నిర్మిస్తున్నా. జాతర ప్రారంభానికి సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు.జాతర జరిగే మూడురోజులు తాగు నీరు, పారుశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.