కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 44వ జాతీయ రహదారి మెదక్ జిల్లాలో తూప్రాన్ నుంచి రామాయంపేట వరకు 56 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ మార్గంలో జిల్లా పరిధిలో సుమారు 25 వరకు దాబాలు ఉన్నాయి. మరోవైపు సంగారెడ్డి, నాందేడ్, అకోలా జాతీయ రహదారి 28 కిమీటర్లు ఉండగా, జిల్లాలో సుమారు 5 వరకు దాబాలు ఉన్నాయి. దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 22న జనతా కర్ఫ్యూ ప్రకటించగా అంతా ఇళ్లకే పరిమితమై సహకరించి విజయవంతం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతటితో సరిపెట్టక పరిస్థితి చేయిదాటక ముందే కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర దుకాణాలు మినహా అన్నింటినీ మూసివేశారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు, దాబాలు సైతం మూతపడ్డాయి.
ప్రతిరోజూ 500 మంది..
లాక్‌డౌన్ నేపథ్యంలో దుకాణాలు, ఇతర చిన్నా చితక కంపెనీల్లో పనిచేసే వేలాది కార్మికులు రోడ్డున పడ్డారు. వాళ్లు నివాసం ఉండే అద్దె గృహాల యజమానులు, పనిలో పెట్టుకున్న వారు వారి బాగోగులు చూడక పోవడంతో పొట్టకూటికి రాష్ట్రాలు దాటి వచ్చిన వారు సొంతూళ్లకు పయనమయ్యారు. వెళ్లేందుకు ప్రజా రవాణా లేకపోవడంతో వందల కిలోమీటర్లు కాలినడకనే వెళుతున్నారు. ఇలా 44వ జాతీయ రహదారిపై గడచిన ఐదు రోజులుగా ప్రతి రోజూ కనీసం 500 మంది వరకు వెళుతున్నారు.