కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం వల్ల వలస వెళ్లిన వారు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. వారు జీవనోపాధి కోల్పోవడంతో.... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వరమైంది. మెదక్ జిల్లాలో 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వాటిల్లో 12,043 శ్రమశక్తి సంఘాలు. 1,67,426 కుటుంబాలకు జాబ్‌కార్డులు జారీ చేశారు. ఈమేరకు 3.79 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో వివిధ పనులు చేపడుతున్నారు. గత నెల 1 నుంచి క్రమంగా కూలీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏప్రిల్ 1న 4,200 మంది కూలీలు హాజరవగా, ఈ నెల 5న 1,01,500 మంది కూలీలు హాజరవడం గమనార్హం. గతేడాది మే 5న 50 వేల మంది కూలీలు పనిచేశారు.
పాపన్నపేట మండలంలో అత్యధికంగా...
మంగళవారం జిల్లాలోని పాపన్నపేట మండలంలో అత్యధికంగా 7,254 మంది, అత్యల్పంగా మనోహరాబాద్‌లో 2,128 మంది పనులకు వచ్చారు. పెద్దశంకరంపేటలో 7,153, హవేలిఘనపూర్, శివ్వంపేట, చిన్నశంకరంపేట, టేక్మాల్ మండలాల్లో 6 వేల మందికి పైగా పాల్గొంటున్నారు. మే నెలకు సంబంధించి కూలీలకు 27.42 లక్షల పనిదినాలను కల్పించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 7 లక్షలు కల్పించారు.