భావితరాలు బాగుండాలంటే తప్పకుండా మొక్కలు నాటాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం హవేలిఘన్‌పూర్ మండలంలోని బూర్గుపల్లిలో మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి ఆమె మొక్కలను నాటారు. ప్రస్తుతం చెట్లు లేకపోవడం వల్ల వర్షాలు సమృద్ధిగా పడటం లేదని ఎమ్మెల్యే అన్నారు.
ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని.. అందుకు అనుగుణంగా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పని చేయాలన్నారు. గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేసి గ్రామస్థులకు అవసరమైన మొక్కలను అందజేస్తామని ఎమ్మెల్యే వివరించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందజేస్తామని.. వాటిని నాటి సంరక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని డ్వాక్రా మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు.