ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని... ఈ విషయంలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామ అభివృద్ధి కోసం 1.64కోట్ల నిధులను మంజూరు చేశారు. గ్రామంలో మురికి కాలువలు, సీసీ రోడ్లు, ఫంక్షన్ హాల్, రైతు వేదికలు, రైతు కల్లాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. ప్రగతిధర్మారంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి గ్రామంలో ఆకస్మికంగా పర్యటించి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన వసతులు కల్పించాలన్నారు. గ్రామంలోని వీధుల్లో పర్యటించి సీసీ రోడ్లు వేయించాలన్నారు.
ప్రగతి ధర్మారం గ్రామంలో పర్యటించిన జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్
మెదక్ జిల్లా ప్రగతి ధర్మారం గ్రామంలో జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన వసతులు కల్పించాలన్నారు.
గ్రామంలోని ఒక వీధిలో తాగునీటికి కొంత ఇబ్బందిగా ఉందని, తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు ఇన్‌ఛార్జి కలెక్టర్‌ను కోరగా ఆయన వెంటనే స్పందించారు. వెంటనే ఏఈతో ఫోన్లో మాట్లాడి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం గ్రామంలో వైకుంఠధామం పనులను కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. మరో వారం రోజుల్లో గ్రామంలో పర్యటిస్తానని పరిస్థితుల్లో మార్పులేనట్లయితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీవో సాయిరామ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కొండపోచమ్మ జలాశయానికి జలకళ