తెలంగాణ

telangana

ETV Bharat / state

కరుణామయుడే ప్రేమగా పిలిచే అద్భుత నిలయం - CHRISTMAS CELEBRATIONS IN MEDAK CHURCH

అన్నార్తుల ఆకలి తీర్చడం కోసం వెలసిన దేవాలయం. పరమత సహనాన్ని చాటుతూ... శాంతికి, ప్రేమకు ప్రతీకగా నిలుస్తున్న ఆధ్యాత్మిక కట్టడం. దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరకుండా... నిశ్చలంగా నిలబడ్డ ప్రార్థనా మందిరం. కరుణామయుడే ప్రేమగా తన వద్దకు పిలుస్తున్నాడన్న భావన కల్పించే అత్యద్భుత ఆధ్యాత్మిక కట్టడం. 3 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో దేశవిదేశాల పర్యటకులు పాల్గొననున్నారు. క్రిస్మస్​ సందర్భంగా మెదక్​ చర్చి పూర్వాపరాలపై కథనం...

MEDAK CHURCH SECOND LARGEST CHURCH IN ASIA ALL SET TO USHER IN CHRISTMAS
MEDAK CHURCH SECOND LARGEST CHURCH IN ASIA ALL SET TO USHER IN CHRISTMAS

By

Published : Dec 24, 2019, 4:33 PM IST

కరుణామయుడే ప్రేమగా పిలిచే అద్భుత నిలయం

మెదక్‌ పట్టణంలో సువిశాలంగా నిర్మించిన చర్చి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరొందింది. మహోన్నత ఉద్దేశంతో... శ్రమజీవుల చెమట చుక్కల నుంచి పుట్టిన మెదక్‌ చర్చ్​పుట్టుపూర్వొత్తరాలు ఓ సారి చూద్దాం.

ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో...

లండన్‌కు చెందిన రెవరాండ్ చార్లెస్ వాకర్ ఫాస్నేట్ అనే మతగురువు మెదక్ ప్రాంతానికి వచ్చినప్పుడు... ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో అలమటిస్తోంది. స్థానికులందరికి ఉపాధి కల్పించి.. ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఫాస్నేట్‌.... చర్చి నిర్మాణానికి పూనుకున్నాడు. 1914లో గోతిక్ విధానంలో 12 వేల మంది కార్మికులు పదేళ్ల పాటు శ్రమించి ఈ అత్యద్భుత కట్టడాన్ని నిర్మించారు.

కదిలించే క్రీస్తు జీవిత చిత్రాలు...

ఇటలీ దేశస్థులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు, కళాకారులు చర్చిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. చర్చికి 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో కేథడ్రాల్ ఉటుంది. విశాలంగా ఉండే ఈ కేథడ్రాల్‌లో ఒకేసారి 5వేల మంది ప్రార్థన చేయవచ్చు. ఆరు రంగుల మొసాయిక్ టైల్స్​ను బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన అద్దాలపై యేసు ప్రతిమ... క్రీస్తు జీవితాన్ని చిత్రించారు. కుడి వైపు క్రీస్తు జననం.. ఎడమ వైపు శిలువ వేసిన దృశ్యం.. ముందు భాగంలో యేసు పునఃరుద్ధరణ చిత్రాలు అద్భుతంగా దర్శనమిస్తాయి. సూర్యకిరణాలు తాకగానే ఈ చిత్రాలు మరింత ప్రకాశవంతమవడం వీటి ప్రత్యేకత.

పిల్లర్లు, బీములు లేకుండానే 2 అంతస్తులు...

పూర్తిగా రాళ్లు, డంగుసున్నం ఉపయోగించి నిర్మించిన ఈ చర్చిలో ప్రతీ అడుగు ఒక కళాఖండమే. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. 175 అడుగుల ఎత్తున్న శిఖరం నాటి పనితనానికి నిదర్శనం.

ఒక్క రోజే 2 లక్షల మంది...

ఈ చర్చిలో 3 రోజుల పాటు క్రిస్​మస్​ ఉత్సవాలు జరుగుతాయి. క్రిస్​మస్ రోజు ఉదయం 4:30 నిమిషాలకు ప్రాతఃకాల ప్రార్థన ప్రత్యేకంగా నిర్వహిస్తారు. 10 గంటలకు ఆరాధన నిర్వహిస్తారు. ఉదయం నాలుగింటి నుంచి రాత్రి పదింటి వరకు భక్తుల ప్రార్థనలు నిరంతరాయంగా సాగుతాయి. పండగ ఒక్క రోజే సుమారు 2లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. పారిశుద్ధ్యం, తాగు నీటిపై ప్రత్యేక దృష్టి సారించారు.

500 మందితో బందోబస్తు...

పోలీస్ శాఖ సైతం భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు 500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాల ద్వారా కదలికలు పరిశీలించనున్నారు. షీటీం బృందాలు సైతం భద్రతలో పాల్గోనున్నాయి. వేలాదిగా వచ్చే వాహనాల వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా తగు ఏర్పాట్లు చేశారు.

రంగు రంగుల విద్యుత్​ కాంతుల అలంకరణతో మెదక్​ చర్చి కొత్త శోభను సంతరించుకుంది. మూడు రోజుల పాటు సాగనున్న వేడుకల్లో భారీ సంఖ్యలో భక్తులు, పర్యటకులు చేరుకుని ఏసు దీవెనలు పొందనున్నారు.

ఇవీ చూడండి: 'మొదటి విడత స్ఫూర్తితోనే మలివిడత పల్లెప్రగతి'

ABOUT THE AUTHOR

...view details