మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏడుపాయలలో అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయలలోని వేడుకలకు ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరై.. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయాన్ని చేరుకున్న మంత్రిని.. పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడుపాయల ఉత్సవాలు దినదినాభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం ఒక కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
మరింత అభివృద్ధి చేస్తాం....
భక్తుల స్నానాల కోసం సింగూరు నుంచి 0.35 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరుగుతుందని వివరించారు. తెరాస ప్రభుత్వం ఆధ్వర్యంలో పోతంశెట్టి పల్లి నుంచి ఏడుపాయల వరకు వంద ఫీట్ల సీసీ రోడ్, డివైడర్ను ఏర్పాటు చేసేందుకు 36 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాలేశ్వరం సింగూరు నీళ్లు ద్వారా ఈ ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి జాతరలను అత్యంత వైభవంగా జరిపిస్తున్నారని వివరించారు. ఏడుపాయలను మరింత అభివృద్ధి చేయడం కోసం వచ్చే సంవత్సరం వరకు 50 లక్షల రూపాయలతో మహిళల కోసం స్నానఘట్టాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.