Heavy Rains in Medak: గతంలో ఎప్పుడు లేన్నంతగా ఒక్క రాత్రిలో మెదక్ పట్టణంలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ శివారులోని ఫతేనహార్, మహబూబ్‌నహర్ కాలవలు పొంగి ప్రవహించడంతో పాటు.. కాలువలకు గండి పడటం వల్ల మెదక్ సహా పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. మెదక్‌లోని సాయినగర్, వెంకట్రావ్‌నగర్, ఆటోనగర్ కాలనీల ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రహదారులపైకి నీరు చేరగా.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. హావేలిఘనపూర్ మండలంలోని గంగపూర్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వంతెన వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
చిన్న శంకరంపేట మండలంలో రాత్రి కురిసిన వర్షానికి అన్ని చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. చందాపూర్, జంగారై.. గ్రామాల మధ్య జంగారై కుడిచెరువు అలుగు విస్తారంగా పారడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. ధరిపల్లి ఉప్పులింగాపూర్ మధ్య రహదారి పైనుంచి నీరు పారడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. తుర్కాల మాందాపుర్ వద్ద.. రహదారి మీదుగా వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 30 ఏళ్లుగా అలుగుపారని శలిపేట నల్లచెరువు.. మత్తడి దూకుతోంది.
వెల్దుర్తి మండలం చర్లపల్లి గ్రామం వద్ద మల్లురి మల్లారెడ్డి అనే రైతు కోళ్లఫారంలోకి వరద నీళ్లు చేరి వెయ్యి కోళ్లు మృతి చెందాయి. వెల్దుర్తి నుంచి యశ్వంతరావుపేట వెళ్లే రహదారిలో కుమ్మరి వాగు వద్ద కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాతూర్ నుంచి రాయిన్‌పల్లి, కొంటూర్ నుంచి వెంకటాపూర్, మల్కాపూర్ తండా నుంచి మెదక్ పోయే మార్గంలో ఉన్న వంతెనలు భారీ వరదకు మునగడం వల్ల ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పాపన్నపేట, కొల్చారం మండలాల్లోని వేల ఎకరాల వరి పంట నీట మునిగింది. చేగుంట మండలం రెడ్డిపల్లిలోని శ్రీలక్ష్మీ గణేష్ మినరల్స్ కంపెనీలో.. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి బిహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
నార్సింగి వద్ద 44 జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్డుపై నీటి ఉద్ధృతికి ఓ ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆ వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మనోహరాబాద్ మండలం రామాయంపల్లి వద్ద రైల్వే అండర్ పాస్.. వరదతో నిండిపోయింది. దీంతో జాతీయ రహదారి-44పై గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. పటాన్ చెరులోని సాకీ చెరువు అలుగు పారడంతో.. 65 జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచాయి. హావేలిఘనపూర్ మండలం రజీపేట్ గ్రామంచాయతీ కప్రాయిపల్లి గ్రామం ప్రధానరోడ్డు తెగిపోవటంతో.. వరదలో 6 ఆవులు కొట్టుకుపోయాయి.