తెలంగాణ

telangana

గర్భంలోనే శిశువు మృతి.. బంధువుల దాడి.. వైద్యుల ధర్నా.. అసలేం జరిగింది?

మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ గర్భంలోనే ఆడశిశువు మృతి చెందింది. కాన్పు చేసే సమయంలో పాప చనిపోవడంతో.. వైద్య సిబ్బందిపై మహిళ బంధువులు దాడి చేశారు. దీంతో వైద్యులు విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.

By

Published : Nov 4, 2021, 1:18 PM IST

Published : Nov 4, 2021, 1:18 PM IST

child died in medak hospital
మెదక్​ ఆస్పత్రిలో వైద్యుల నిరసన

వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని నర్సులు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం పంతులపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ మాధవికి పురిటినొప్పులు రావడంతో బుధవారం రాత్రి 2గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు కాన్పు చేసే సమయంలో, గర్భంలోనే పాప ఉమ్మనీరు మింగి మరణించింది.

ఆస్పత్రి ఎదుట వైద్య సిబ్బంది ధర్నా

పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మాధవి కుటుంబ సభ్యులు... వైద్య సిబ్బంది, సెక్యూరిటీపై దాడి చేశారు. దీంతో దాడికి నిరసనగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కాకుండా ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ వెంకట్ ఆస్పత్రి వద్దకు చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు..

ఈ సంఘటనతో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులకు భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్ పోలీసులను కోరారు. గతంలోనూ డాక్టర్లపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనల వల్ల విధులు నిర్వర్తించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details