సామాజిక సేవలో ముందుండే రామోజీ ఫౌండేషన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఆనందనిలయం వృద్ధుల ఆశ్రమానికి రామోజీ ఫౌండేషన్ చేయూతనందించింది. సామాజిక సేవా దృక్పథంలో భాగంగా... సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న వృద్ధాశ్రమానికి రామోజీ ఫౌండేషన్ 4.19 లక్షల విలువ గల అవసరమైన సామగ్రిని అందించింది.
ఈనాడు యూనిట్ కరీంనగర్ కార్యాలయ మేనేజర్ యుగంధర్ రెడ్డి చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరికి ఈ వస్తువులను అందజేశారు. వృద్ధాశ్రమానికి 65 ఇంచుల ఎల్ఈడీ టీవీ, రిఫ్రిజిరేటర్, గ్రీజర్, వాటర్ ట్యాంక్, డైనింగ్ టేబుళ్లు, మంచాలు, కుర్చీలను రామోజీ సంస్థ కొనుగోలు చేసి అందజేసింది.
ఎల్లప్పుడూ వార్తలతో బిజీబిజీగా ఉండే ఈనాడు రామోజీ సంస్థలు సామాజిక సేవలో పాల్గొని.. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వృద్ధాశ్రమానికి చేయూతను అందించడం చాలా ఆనందంగా ఉందని కలెక్టర్ భారతి హోళీ కేరి తెలిపారు. అన్ని సౌకర్యాలు సదుపాయాలు ప్రభుత్వమే అందించాలని చూడకుండా.. స్వచ్ఛంద సంస్థలతో పాటు ఇలా ప్రైవేటు కంపెనీలు కూడా ముందుకు వస్తే చాలా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వృద్ధులకు ఆశ్రమం ఉండడం సరైంది కాదని.. అసలు అలాంటి అవకాశమే వారికి రాకుండా చూడాలని హోళీకేరి అభిప్రాయపడ్డారు.