తమను ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు దారి లేకుండా గోడ నిర్మించారని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. సమీప బంధువే భూమిని కబ్జా చేయాలని చూస్తూన్నారని.. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ రెబ్బనపల్లి గ్రామానికి చెందిన బండ ప్రకాష్ మరియు అతని కుటుంబ సభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
ఇంటి దారి లేకుండా చేశారని బాధితుల నిరసన - మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో బాధితుల నిరసన
తమ ఇంటికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారని పంచాయతీ కార్యాలయం ముందు బాధితులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమీప బంధువే దారికి అడ్డుగా గోడ నిర్మించి వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ఇంటి ముందు అడ్డుగోడ నిర్మించి.. వెనుక భాగంలో ముళ్ల కంచె వేసి తమ రాకపోకలను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితురాలు బండ శారద తెలిపారు. అయినా కొన్నాళ్ల తర్వాత మళ్లీ వేధింపులు మొదలయ్యాయని వాపోయారు. కుల బహిష్కరణ చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె అన్నారు. ఇప్పటికైనా పోలీసులు, గ్రామ పెద్దలు స్పందించి తమ కుటుంబాన్ని వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఇంటి ఎదుట అడ్డుగా నిర్మించిన గోడను తొలగించేలా చర్యలు తీసుకోవాలని బాధితురాలు శారద కోరారు.