Harish Rao speech at Chennuru public meeting: దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం విపక్షాలను భయపెడుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గోబెల్స్ ప్రచారంతో లబ్ధి పొందాలనేది బీజేపీ కుట్ర అని ఆయన ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన.. జిల్లాలోని జైపూర్, భీమారం, చెన్నూర్ మండలాల్లో సుమారు రూ. 210 కోట్ల విలువైన 30 అభివృద్ధి పనులకు హరీశ్‌రావు శంకుస్థాపనలు చేశారు.
చెన్నూరులో ఆర్వోబీ, 100 పడకల ఆసుపత్రి, గ్రంథాలయాలు, వీధిలైట్ల ఏర్పాటును మంత్రి ప్రారంభించారు. అనంతరం లక్సెట్టిపేటలో పర్యటించిన మంత్రి.. అక్కడ 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నస్పూర్‌లో రూ.3.50 కోట్లతో నిర్మించే ఔషధ గిడ్డంగికి మంత్రి శంకుస్థాపన చేశారు. లక్ష ఎకరాలకు నీరందించే ఎత్తిపోతల పథకాన్ని చెన్నూరులో నిర్మించనున్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు.
"బీజేపీ నేతలు సీబీఐ, ఈడీ, ఐటీని నమ్ముకున్నారు. దర్యాప్తు సంస్థలతో విపక్షాలను భయపెడుతున్నారు. గోబెల్స్ ప్రచారంతో లబ్ధి పొందాలనేది బీజేపీ కుట్ర. సింగరేణి ప్రైవేటీకరణకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ పాలన తెస్తామని రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఛత్తీస్‌గఢ్ పాలన తెలంగాణకు అవసరం లేదు. ఛత్తీస్‌గఢ్ నుంచి వేలాది మంది ఇక్కడికి వలస వస్తున్నారు. తెలంగాణ ప్రజలు మరోచోటికి వలస వెళ్లాల్సిన పరిస్థితి వద్దు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొడుతోంది."- హరీశ్‌రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
Harishrao fire on Revanth Reddy: అనంతరం చెన్నూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఛతీస్‌గఢ్ రాష్ట్రంలో సాగుతున్న పాలనవలె రాష్ట్రాన్ని పరిపాలిస్తామని రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఛతీస్‌గఢ్ నుంచి వలస కూలీలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్ పాలన తెస్తా అంటున్న రేవంత్.. రాష్ట్రాన్ని వలసల రాష్ట్రం చేస్తారా అని ప్రశ్నించారు.