మంచిర్యాల జిల్లా కేంద్రంలో జనాభాతో పాటు ట్రాఫిక్ సమస్యా రోజురోజుకూ పెరుగుతోంది. భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు వాటిని బైపాస్ రోడ్డుకు మళ్లించారు. ఫలితంగా నిత్యం రద్దీగా మారిన బైపాస్‌రోడ్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మాత్రం నాయకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిత్యం భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా తయారయ్యాయి. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో సుమారు లక్షా 20 వేల జనాభా నివసిస్తున్నారు. బైపాస్‌రోడ్డు చుట్టుపక్కల సంజీవయ్య కాలనీ, గౌతమినగర్, రాళ్లపేట, రెడ్డి కాలనీ, లక్ష్మీనగర్ తదితర కాలనీలు ఉన్నాయి. ఆయా కాలనీల ప్రజలు ఏ పని కోసమైనా బైపాస్ రోడ్డు మీదుగానే జిల్లా కేంద్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గుంతల రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గుంతలు పడిన రహదారిని అధికారులు ప్యాచ్ వర్క్‌లతో మూసివేస్తున్నారు. ఫలితంగా కొద్దిరోజులకే రోడ్లు మళ్లీ యథాతథ స్థితికి చేరుకుంటున్నాయి.