మొన్నటి దాక మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జరిమానాలు విధించడం.. వాహనాలు సీజ్ చేయడం.. కోర్టులో కౌన్సిలింగ్ ఇవ్వడం చూసే ఉంటాం. కానీ దీనికి భిన్నంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిపై మంచిర్యాల న్యాయస్థానం వినూత్న తీర్పునిచ్చింది. తాజాగా 13 మందిని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని శుభ్రం చేయాలని మంచిర్యాల జిల్లా మొదటి తరగతి న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
నిబంధనలను ఉల్లఘించి పలు మార్లు పట్టుబడినా వారిలో మార్పు రాకపోవటంతో ఈ శిక్ష విధించారు. రెండు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరోగ్య కేంద్రంలో శుభ్రత పనులు చేయాలని లేదంటే పది రోజుల సాధారణ జైలు శిక్ష విధించాలని తెలిపారు. న్యాయమూర్తి ఉపనిషత్ వాణి తీర్పుతోనైనా మందు బాబులకు మార్పు రావాలని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
మద్యం సేవించి వాహనాలు నడపరాదని నిబంధనలు ఉన్నప్పటికీ చాలామందిలో మార్పు రావడంలేదని ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమతోపాటు ఎదుటివారు కూడా బలవుతున్నారనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. ఈ తీర్పుతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిలో కనువిప్పు కలుగుతుందని ఆయన వివరించారు.