KTR Mancherial District Tour : ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథ పనులు చేపట్టామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో రూ.2,000 కోట్లతో సిమెంట్ పరిశ్రమ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు. బెల్లంపల్లి యువతకు ఉద్యోగాలు రావాలని.. త్వరలోనే ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు ఇక్కడే 350 ఎకరాల్లో రూ.20 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ వస్తోందని కేటీఆర్ వెల్లడించారు.
బెల్లంపల్లికి ప్రత్యేక ఆహారశుద్ధి కేంద్రం వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. బెల్లంపల్లిలో రోడ్ల విస్తరణ పనులకు.. ఎస్సీ, ఎస్టీ వసతిగృహానికి శంకుస్థాపన చేశామని వివరించారు. బెల్లంపల్లి-వెంకటాపూర్ రహదారికి రూ.5 కోట్లు కేటాయించామని అన్నారు. ఈ ప్రాంతంలో 7,000 ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. అందుకు ఒక్కో స్థలం విలువ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు.
అంతకుముందు కేటీఆర్ కాసీపేట మండలం దేవపూర్లోని ఓరియంట్ సిమెంట్ కర్మాగారం నాల్గో ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ పనులు పూర్తయితే 4,000 మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. దేవపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు పరిశ్రమ నిర్మాణానికి సహకరించాలని కోరారు. కాలుష్య రహితంగా నాల్గో ప్లాంట్ విస్తరణ పనులు చేపట్టాలని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
"రూ.2,000 కోట్లతో సిమెంట్ పరిశ్రమ విస్తరణ పనులు చేపట్టాం. బెల్లంపల్లి యువతకు ఉద్యోగాలు రావాలి త్వరలో బెల్లంపల్లిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మిస్తాం. బెల్లంపల్లిలో 350 ఎకరాల్లో రూ.20 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ వస్తోంది. బెల్లంపల్లికి ప్రత్యేక ఆహారశుద్ధి కేంద్రం వచ్చింది. రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశాం. ఎస్సీ, ఎస్టీ వసతిగృహానికి శంకుస్థాపన చేశాం. బెల్లంపల్లి-వెంకటాపూర్ రహదారికి రూ.5 కోట్లు కేటాయించాం. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథ పనులు చేపట్టాం." -కేటీఆర్, మంత్రి