Heart Breaking Incident Of Cows Accident Mancherial : ఈరోజుల్లో ఎవరికైనా ఏమైనా జరిగితే.. మనకెందుకులే అని సంబంధం లేకుండా ఉంటారు చాలా మంది. ఇక రోడ్డు పక్కన ఎవరైనా ప్రమాదం జరిగి మృతి చెందినా, గాయపడినా.. అటువైపు నుంచి వెళ్లే సాటి మనుషులు కనీసం వాళ్లను పట్టించుకోకుండా.. మనకెందులే అని సంబంధం లేకుండా తప్పుకొని వెళుతున్నారు. ఇలాంటి విషయాలు రోజూ వార్తల్లో బోలెడు చూస్తుంటాం. అయ్యో పాపం ఎవరైనా సాయం చేస్తే బాగుండేది కదా అని ఆ క్షణానికి ఓ కన్నీటి బొట్టును కారుస్తాం. మనిషిలో రోజురోజుకూ అహం పెరిగిపోయి.. మానవత్వం నశించిపోతోంది. తోటివారు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా కాస్త జాలి చూపలేకుపోతున్నారు నేటి జనం.
Cows Accident Mancherial Today :ఎంతో తెలివైన మనుషుల కంటే.. ఇప్పుడు పశువులే కాస్త నయంగా ఉన్నాయి. వాటికి మానవత్వం అంటే ఏంటో తెలియకపోయినా.. తోటిజీవులు బాధపడుతుంటే అవి కూడా కన్నీళ్లు కారుస్తాయి. ఇలాంటి సంఘటనే మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ ఆవు మృతి చెందగా.. మరో ఆవు కాళ్లు విరిగిపోయిన అచేతనంగా పడి ఉంది. ఆ దారిలో వెళ్తున్న వాళ్లెవరూ ఆ పశువులను పట్టించుకోలేదు. కానీ అటుగా వెళ్తున్న తోటి ఆవులు.. ఈ ఆవు అనుభవిస్తున్న నరకాన్ని చూశాయి. దాని దగ్గరకు వచ్చి.. మేమున్నాం నేస్తమా అంటూ అండగా నిలిచాయి. కాళ్లు విరిగి బాధతో ఆ ఆవు ఏడుస్తుంటే.. దాని బాధను చూసి ఈ ఆవులు కూడా కంటతడి పెట్టడం చూస్తే ఎంత కఠిను హృదయాలైనా కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో వేకువ జామున వాహనం ఢీకొని రెండు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. రహదారి పక్కనే పడి రెండు ఆవులు నరకయాతన అనుభవిస్తున్నాయి. అటువైపు నుంచి వెళ్లే ఏ వాహనదారుడు కూడా వాటి పరిస్థితిని చూసిన పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం వీటి పరిస్థితిని చూసి టోల్ ఫ్రీ నంబర్ 1962కు ఫోన్ చేసిన.. అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ యువకుడు కూడా ఏం చేయలేని పరిస్థితిలో అక్కడి నుంచి దిగాలుగానే వెళ్లిపోయాడు. సరైన సమయానికి వైద్యం అందక.. రెండు ఆవుల్లో ఒక ఆవు గాయాలతో కొట్టుమిట్టాడుతూ మరణించింది.