తెలంగాణ

telangana

ETV Bharat / state

Bugga Rajarajeswara Temple: ఆ ఆలయంలో "ముక్కంటిని స్వయంగా అభిషేకిస్తున్న గంగమ్మ" - మంచిర్యాల వార్తలు

Bugga Rajarajeswara Temple: గంగను సిగలో బంధించిన గౌరీపతిని... ఆ ఆలయంలో స్వయంగా గంగామాత అభిషేకిస్తూ ఉంటుంది. రుతువులు మారినా.. కాలాలు కరుగుతున్నా.. నీలకంఠుని సేవలో లీలమై ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా శివలింగాన్ని ఏకధారగా అభిషేకిస్తూ.. ఉమాపతి సమేతంగా భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటోంది. ఈ సుమనోహర దృశ్యం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాలలో కొలువై ఉన్న బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనమిస్తోంది.

Bugga Rajarajeswara
Bugga Rajarajeswara

By

Published : Feb 5, 2022, 6:33 AM IST

Bugga Rajarajeswara Temple : అభిషేక ప్రియుడైన నీలకంఠుడు ఆ ప్రాంతంలో మూడు శిఖరాల మధ్య కొలువై ఉన్నాడు. మనసారా ప్రార్థించి.. భక్తితో అభిషేకిస్తే.. కోరిన వరాలిచ్చే ఉమాపతిని ఆ ఆలయంలో ప్రకృతి నిత్యం అభిషేకిస్తూ ఉంటుంది. సాధారణంగా శివాలయాల్లోని గర్భగుడిలో నీటి కుండను ఏర్పాటు చేస్తారు. ఆ పాత్రలోంచి నీరు ధారగా శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటుంది. అయితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలో బుగ్గ రాజరాజేశ్వరునిగా పూజలందుకుంటున్న గౌరీపతిని స్వయంగా గంగ... అభిషేకిస్తూ ఉంటుంది.

Bugga Rajarajeswara

ఆలయ చరిత్ర ...

రెండువేల ఏళ్ల క్రితం యతీశ్వరులు, నాగసాధువులు, దిగంబరులు చిత్రకోట పర్వతం నుంచి వలస వచ్చి బెల్లంపల్లి పెద్దబుగ్గ అరణ్యంలో శివుని ప్రత్యక్షం కొరకు తపస్సు చేస్తుండేవారు. మహాశివరాత్రి పర్వదినం నాడు వారికి ఉన్న దివ్య దృష్టితో కాశీకి వెళ్లి ఒక గడియలో తిరిగి వచ్చేవారని చరిత్ర చెబుతోంది. ఒకసారి మహాశివరాత్రి నాడు వారు కాశీకి వెళ్లలేకపోయారు. మహాశివరాత్రి రోజున స్వామి దర్శనం కలగలేదని బాధపడుతూ నిద్రలోకి జారుకోగా... వారికి స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి... తాను వారికి సమీపంలోనే మూడు కొండల మధ్య వెలుస్తున్నానని చెప్పాడు. అనంతరం వారు లేచి చూడగా.. తూర్పు, ఉత్తరం, పశ్చిమ కొండల నడుమ దట్టమైన అరణ్యంలో లింగరూపంలో వెలిసిన గౌరీపతి వారికి దర్శనమిచ్చాడు. నాటి నుంచి ఏటా మహశివరాత్రి పర్వదినాన మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. మూడు రోజుల పాటు బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతరను నిర్వహిస్తారు.

బుగ్గ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం

స్వయంగా అభిషేకిస్తున్న గంగాదేవి..

పూర్వం స్వామివారిని అభిషేకించేందుకు జలం అవసరం కాగా.. గంగాదేవిని ప్రార్థించగా.. శివుని ఆజ్ఞమేరకు ఉత్తర కొండలో ఉద్భవిస్తానని మాట ఇచ్చినట్లు స్థలపురాణం చెబుతోంది. అప్పటి నుంచి గర్భగుడిలో స్వామివారిని నిత్యం గంగామాత అభిషేకిస్తూ వస్తోంది. ఈ నీరు దక్షిణ దిశగా ఉన్న కోనేరులో చేరుతుంది. ఈ కోనేటిలో భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు.

ఈ క్షేత్రం కన్నాల గ్రామంలో మూడు కొండల మధ్య ఉంది. ఈ ఆలయంలో స్వామివారిని ఉత్తరాన ఉన్న నీటి ఊట ద్వారా స్వామివారికి జలాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వస్తుంటారు. -ఆలయ పూజారి

ఘనంగా శివరాత్రి ఉత్సవాలు...

శ్రీ బుగ్గ రాజరాజేశ్వస్వామి ఆలయంలో ఏటా మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ జాతరకు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కేవలం శివరాత్రి రోజే కాకుండా నిత్యం ఈ ఆలయంకి వందలాది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

ఆలయం ఉత్తర భాగంలోని నీటి ఊట

మా పూర్వీకుల నుంచి ఈ స్వామివారిని దర్శించుకుంటున్నాం. స్వామిని దర్శించుకుని ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది. ఎప్పుడు వీలు కుదిరినా స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటాం. -భక్తుడు

ఎలా చేరుకోవాలి...

ఈ ఆలయానికి చేరుకునేందుకు హైదరాబాద్​ సహా రాష్ట్రం నలుమూల నుంచి మంచిర్యాలకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్​ నుంచి మంచిర్యాలకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

"ముక్కంటిని స్వయంగా అభిషేకిస్తున్న గంగమ్మ"

ఇదీ చూడండి:Rush at Medaram Jatara : మేడారంలో భక్తుల రద్దీ.. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తుల కిటకిట

ABOUT THE AUTHOR

...view details