తెలంగాణ

telangana

ETV Bharat / state

Vegetables Price Telangana : మండిపోతున్న కూరగాయల ధరలు - మహబూబ్​నగర్​లో పెరిగిన కూరగాయల ధరలు

Vegetables Price hike today Telangana : మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కనీసంగా కిలో రూ.60 నుంచి 120 వరకూ ఖర్చుచేసి కొనుగోలు చేయాల్సి వస్తోంది. రూ.500 తీసుకెళ్తే ఐదారు రకాల కూరగాయలు తెచ్చుకోవడం కష్టంగా మారింది. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణం అనుకూలించని కారణంగా స్థానికంగా కూరగాయల ఉత్పత్తి పడిపోగా... ధరలు వారంలోనే అమాంతం ఎగబాకాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నా అక్కడా ధరలు మండిపోవడంతో...ఆ ప్రభావం స్థానిక మార్కెట్‌పై పడుతోంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 27, 2023, 7:08 AM IST

Updated : Jun 27, 2023, 11:57 AM IST

మార్కెట్లో మండిపోతున్న కూరగాయల ధరలు

Vegetable Prices in Mahabubnagar :ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఐదొందలు తీసుకువెళ్తే 5 రకాల కూరగాయలే వస్తున్నాయి. 10 రకాలు కొనాలంటే కనీసంగా వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంత ఖర్చుచేసినా వారం రోజులు కూడా ఆ కూరగాయలు సరిపోవడం లేదు. దీంతో సామాన్యులు కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాదు, చిరుద్యోగులు, ప్రైవేటు కొలువులు చేసే మధ్యతరగతి వాళ్లకూ ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా టమాటా, పచ్చిమిర్చి, కాప్సికం, క్యారెట్ సహా ఇతర కూరగాయలు కిలో రూ.70 నుంచి 120 వరకూ పలుకుతున్నాయి. వారం రోజుల్లో టమాటా, మిర్చి ధరలు అంమాంతంగా రూ.20 నుంచి 30 వరకు పెరిగిపోయాయి.

Vegetables Price hike Telangana :ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సిన రావడమే అందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం కర్ణాటకలోని బెల్గాం నుంచి పచ్చిమిర్చి, బెంగళూరు నుంచి టమాట, క్యాప్సికం, క్యారెట్‌, గుజరాత్‌ నుంచి ఆలుగడ్డ, శంషాబాద్‌, బోయినపల్లి మార్కెట్ల నుంచి క్యారెట్‌, కొత్తిమీర, కాకర, చిక్కుడు, ఆకుకూరలు, కర్నూలు నుంచి టమాట, ఆలుగడ్డ, బీరకాయలు దిగుమతి అవుతున్నాయి. అక్కడా వాతావరణం అనుకూలించక కూరగాయల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దీంతో అక్కడ ధరలు పెంచేశారు. ఈ ప్రభావం రాష్ట్రంలోని మార్కెట్లపైనా పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలకు కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లలో అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వాతావరణం అనకూలించకపోతే కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

'కూరగాయల ధరలు గత వారం రోజులుగా చాలా పెరిగిపోయాయి. ఎండాకాలంలో వడగళ్ల వర్షాల కారణంగా పంట నష్ట పోయాం. ఇప్పుడు వేసిన పంట రావడానికి ఇంకా రెండు, మూడు నెలలు పడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి వాటి ఛార్జీలు అన్నీ కలిపి కూరగాయల ధరలు పెరిగిపోయాయి' .- బాధిత రైతులు

మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట కూరగాయల మార్కెట్లలో మిర్చి ధరే అన్నింటి కంటే ఎక్కువగా ఉంది. కిలో పచ్చిమిర్చి రూ.100 నుంచి 120 వరకు పలుకుతోంది. కిలో టమాట, కాకరకాయ, క్యారెట్‌, చిక్కుడు, బీరకాయ ధరలు రూ.60 నుంచి 80 వరకు, బెండకాయ, వంకాయ, ఆలుగడ్డలు రూ.30 నుంచి 50 వరకు ఉన్నాయి. ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి. ఇక్కడి రైతులు పండించి మార్కెట్‌కు తీసుకొచ్చిన మూడ్నాలుగు రకాల కూరగాయలను కూడా మధ్య దళారులు, వ్యాపారులే కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొందరు రైతులు మాత్రం దళారులకు లొంగకుండా స్వయంగా విక్రయిస్తున్నారు. అలాంటి రైతులు తక్కువ ధరకు ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌లో మాత్రమే రైతుబజార్లు ఉన్నాయి. మిగతా జిల్లాల్లోని మార్కెట్లలో వ్యాపారుల హవా నడుస్తోంది. వేసవిలో అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసిన కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దిగుబడి అరకొరగానే ఉంది. ప్రస్తుతం రేటున్నా దిగుబడి లేక రైతుకు అధిక ఆదాయం రావడం లేదు. మరోవైపు ఇతర ప్రాంతాల కూరగాయలపై ఆధారపడి వినియోగదారులపై భారం పెరుగుతోంది.

'ముందు అన్ని రేట్లు తక్కువగా ఉండేవి. ఎండాకాలంలో ధరలు పెరుగుతాయి అనుకుంటే వర్షాకాలంలో ధరలు పెరిగాయి. వంకాయ, బెండకాయ మినహా మిగతా కూరగాయల రేట్లు అధికంగా ఉన్నాయి. కూలీనాలీ చేసుకునే వారికి చాలా కష్టంగా మారింది.' - కొనుగోలుదారులు

ధరల పెరుగుదల ప్రభావం గిరాకీపైనా పడింది. టమాట ధర తక్కువగా ఉన్నప్పుడు కిలో రెండు కిలోలు కొనుగోలు చేసిన వినియోగదారులు. ప్రస్తుతం పావుకిలో, అరకిలోకే పరిమితమవుతున్నారు. ఉన్న బడ్జెట్ లోనే కొనుగోలు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. కొత్త పంటలు రావడానికి రెండు నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకూ ధరలు అదుపులోకి రావడం కష్టమేనని వ్యాపారులు అంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 27, 2023, 11:57 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details