తెలంగాణ

telangana

ETV Bharat / state

"పునరావాసం కల్పించాకే ఊళ్లోనుంచి వెళ్తాం" - పాలమూరు- రంగారెడ్డి పథకం

ఓడెక్కే వరకు ఓడ మల్లయ్య ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్లుగా తెలంగాణ సర్కారు వ్యవహరిస్తోందని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఉదండాపూర్ జలాశయ నిర్వాసితులు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. న్యాయం చేసే వరకూ ఊళ్లు ఖాళీ చేసేది లేదని తేల్చి చెబుతున్నారు.

"పునరావాసం కల్పించాకే ఊళ్లోనుంచి వెళ్తాం"

By

Published : Aug 25, 2019, 2:04 PM IST

"పునరావాసం కల్పించాకే ఊళ్లోనుంచి వెళ్తాం"

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి పథకంలో ఉదండాపూర్ జలాశయం కోసం సర్వం త్యాగం చేయనున్న నిర్వాసితులు సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మోసం చేశారని ఆవేదన చెందుతున్నారు. ఉదండాపూర్ జలాశయం కింద జడ్చర్ల మండలం వల్లూరు, ఉదండాపూర్ గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. కిష్టారం, పోలెపల్లి, ఖానాపూర్, నవాబుపేట మండలం తీగలపల్లి, సిద్దోటం, కారుకొండ గ్రామాల్లో వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయి.

పావెకరం పొలం కూడా రావట్లేదు

వీరికి 120 జీఓ ప్రకారం ఎకరా పొలానికి ఐదున్నర, తరి పొలానికి ఆరున్నర లక్షలు ఇవ్వాలని ముందస్తు ఒప్పందానికి వచ్చారు. అందుకు సంబంధించి పరిహారం చెల్లింపులు 70శాతం వరకూ పూర్తయ్యాయి. ఇంకా కొంతమంది రైతులకు చెల్లించాల్సి ఉంది. విడతల వారీగా పరిహారం చెల్లించడం వల్ల తమ వద్ద ఆ డబ్బులు లేకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల కిందట కోల్పోయిన భూములకు ఎకరాలకు ఐదారు లక్షల పరిహారం చెల్లిస్తే... ఆ డబ్బులతో ప్రస్తుతం బయట పావెకరం పొలం కూడా రావడం లేదని వాపోతున్నారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం భూములు, ఇళ్లు అన్నింటికీ ఒకేసారి పరిహారం చెల్లిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెబుతున్నారు.
నష్టంపై సర్వేనే చేయలేదు
ముందస్తు ఒప్పందం ప్రకారం పునరావాసం కోసం ఇళ్ల స్థలాలు తాము కోరుకున్నచోటే ఇవ్వాలని వల్లూరు, ఉదండాపూర్ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ పునరావాసం కల్పించేది ఎక్కడో తేల్చకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పునరావాసానికి సంబంధించి ఎన్ని ఇళ్లున్నాయి, ఎన్ని కుటుంబాలు ఆవాసం కోల్పోతున్నాయి వంటి వాటిపై రెండు గ్రామాల్లోనూ సర్వే జరగలేదు. పునరావాసం విషయాన్ని తేల్చకుండానే జలాశయ నిర్మాణ పనులు చేపట్టండపై వల్లూరు, ఉదండాపూర్ వాసులు మండిపడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేసి... ఎన్నికలు బహిష్కరించిన సందర్భాల్లో అన్ని విధాల న్యాయం చేస్తామన్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పునరావాసం కల్పించి, ప్రతి కుటుంబానికి 20లక్షల వరకూ పరిహారం చెల్లిస్తే తప్ప గ్రామాలు వదిలేది లేదని తేల్చి చెబుతున్నారు.

సీఎం దృష్టి సారించాలి

త్వరలో పాలమూరు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాసితుల సమస్యలపైనా దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులలాగే తమకు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి: లైవ్​: అరుణ్​ జైట్లీకి కన్నీటి నివాళి

ABOUT THE AUTHOR

...view details