ఇళ్లకు పరిహారం చెల్లించే విషయంలో చిక్కులు Udandapur Expats demands compensation: ఉదండపూర్ జలాశయంలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో ఇళ్లకు పరిహారం చెల్లించే విషయంలో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఉదండపూర్, వల్లూరులో ఇళ్లకు పరిహారం అంచనా విషయంలో అవకతవకలు జరిగాయని, గతంలో ఆరోపణలు రాగా క్షేత్రస్థాయిలో మరోసారి సర్వే నిర్వహించారు. తాజాగా తండాల్లో ఉన్న ఇళ్లకు పరిహారం విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Udandapur Reservoir Expats demands : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద జలాశయాన్ని నిర్మిస్తున్నారు. ఈ జలశాయం కింద ఉదండపూర్, వల్లూరు గ్రామాలు సహా అనుబంధంగా ఉన్న తుమ్మలకుంట తండా, రేగడిపట్టి తండా, ఒండిగుట్ట తండా, శామగడ్డ తండా, చిన్నగుట్ట తండాలున్నాయి. ఈ తండాల్లోని ఇళ్లకు పరిహారం అంచనా విషయంలో అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు.
ఇంటి నిర్మాణంతోపాటు వాకిలి సహా ఖాళీ స్థలాలకు సైతం పరిహారం రావాలని నిర్వాసితులు కోరుతున్నారు. వ్యవసాయ భూములకు ఎకరాకు ఐదారు లక్షలిస్తే, ఆ పరిహారం ఏ మాత్రం సరిపోలేదని, ఇప్పుడు ఇళ్ల స్థలాల విషయంలోనూ నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకు ఇచ్చే పరిహారం మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
అదే సమయంలో పునరావాస కేంద్రంలోనూ ఇళ్ల స్థలాలు ఇప్పటికీ కేటాయించలేదని, ఆ పనులు సైతం వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇళ్ల పరిహార చెల్లింపు అంశం.. ప్రస్తుతం భూసేకరణ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఇళ్లకు మాత్రమే పరిహారం ఇవ్వాలా..? ఖాళీ స్థలాలకు సైతం గజాల లెక్కన ఇవ్వాలా..? వ్యవసాయ భూముల్లా గుంటల లెక్కన ఇవ్వాలా...? రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇవీ చదవండి: