హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్లే మార్గంలో దేవరకద్రలోని రైల్వేగేటు పైవంతెన నిర్మాణం కోసం.. ఏళ్లుగా దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు తెరాస హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2018లో అంకురార్పణ జరిగింది. వంతెన పనులు ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాహనదారుల కష్టాలు: ఈ మార్గంలో హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి.. రాయచూర్, నారాయణపేటకు వెళ్లాల్సిన వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఇక్కడున్న రైల్వే గేటు పడితే.. అరగంట నుంచి గంటపాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇలా రోజులో కనీసం 10 నుంచి 20 సార్లు గేటు పడడంతో వాహనదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుని రోగులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ తలెత్తాయి.
నిత్యం దుమ్ము, ధూళి: వంతెన నిర్మాణం జరుగుతుండటంతో రైల్వే గేటు రెండు వైపులా రహదారులు కుచించుకుపోయాయి. గేటు తెరచినప్పటికీ వాహనాలు కిక్కిరిసి ఉండడంతో.. తరచూ ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. బుధవారం జరిగే సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివస్తారు. దీంతో ఆ రోజు ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది. మరోవైపు నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో.. నిత్యం దుమ్ము ధూళితోనూ చుట్టుపక్కల వ్యాపారులు రోగాల బారిన పడుతున్నారు. రైల్ గేటు కారణంగా విద్యార్థులు పాఠశాలలకు సమయానికి వెళ్లలేకపోతున్నారు.
ఎప్పటకి పూర్తి అవుతుందో: 2020 నాటికే వంతెన నిర్మాణం పూర్తవ్వాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పూర్తి కాలేదు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా, అప్రోచ్ రోడ్లు, వంతెనపై తారు రోడ్లు, బ్రిడ్జికి ఇరువైపులా సర్వీసు రోడ్లు పూర్తి చేయాల్సి ఉంది. అన్ని పనులు పూర్తై వంతెన అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడు నెలలు పట్టే అవకాశముంది. కానీ గుత్తేదారు మాత్రం ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు. వాహనదారులు, స్థానికుల కష్టాలను గుర్తించి.. రైల్వే పైవంతెన వీలైనంత త్వరగా పూర్తిచేయాలని.. ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: