Telangana Farmers problems about Money : పంటవేసినప్పుడే కాదు.. కష్టపడి సాధించిన దిగుబడిని విక్రయించినా..... అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. చెమటోడ్చి పండించిన ధాన్యం అమ్మి నెలరోజులు కావొస్తున్నా.... డబ్బులందక కర్షకలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వారంలోనే డబ్బులు చెల్లిస్తామన్న.... ప్రభుత్వ హామీ అమలు కావడం లేదు. ధాన్యం డబ్బులు రాకపోవటంతో యాసంగి సాగుకు సమయం దాటిపోతోందని పాలమూరు రైతులు ఆవేదన చెందుతున్నారు.
దిక్కుతోచని స్థితిలో రైతులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరిపిన 29,644 మంది రైతులకు నేటికీ డబ్బులు జమకాలేదు. వారికి పౌరసరఫరాలసంస్థ ద్వారా.... రూ.312 కోట్లు చెల్లించాల్సి ఉంది. నెలరోజులు గడుస్తున్నా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో... రైతులు ఆందోళన చెందుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు అప్పులు చేసి, కౌలుకు తీసుకుని వానాకాలంలో వరి పంట పండించారు. పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో సరకు విక్రయించారు. ఆ విధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లక్ష 21 వేల 561 మంది రైతులు... 6లక్షల 77వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. అందులో 82వేల 917 మందికి మాత్రమే ఇప్పటివరకు నగదు అందింది. నెల దాటినా మిగతా వారికి జమకాలేదు. అమ్మకాలు జరిపి నెల రోజులు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో పలువురు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఆరు ఎకరాల్లో వడ్లు ఏసినం. దిగుబడి తక్కువే వచ్చింది. 80 క్వింటాలు అమ్మినం. డిసెంబర్లో అమ్మినం. నెల రోజులు అయినా కూడా ఇంకా డబ్బులు రాలేదు. హార్వేస్టర్ వాళ్లకు ఇంకా కట్టలేదు. కూలీలు అడుగుతున్నారు. యాసంగి పంట కాలం దగ్గరపడుతోంది. నాట్లు కూడా పడుతున్నాయి. పెట్టుబడికి డబ్బులు లేవు. అమ్మిన పంట పైసలు త్వరగా వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
-రైతు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
మళ్లీ వడ్డీ వ్యాపారుల వద్దకు..
ప్రస్తుతం యాసంగిపనులు మొదలయ్యాయి. పొలందుక్కి చేసుకునే సమయం మించిపోతుండటంతో డబ్బులు లేక పనులు చేపట్టలేకపోతున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. విధి లేని పరిస్థితిలో మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది.