తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రేగిపోతున్న ఇసుక మాఫియా.. కత్తులతో దాడి చేసినా పట్టించుకోరా?

ఫిర్యాదులు చేసినా స్పందన ఉండదు. దాడులకు తెగబడినా చర్యలుండవు. అందుకే ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఇసుక మాఫియా అగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తాజాగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతున్నాడన్న నెపంతో.. ట్రాక్టర్ యజమానులు ఓ రైతుపై కత్తులతో తెగపడ్డారు. మరో ఇద్దరు రైతులపైనా.. దాడికి దిగారు. 6 నెలలుగా ఇసుక అక్రమ రవాణాపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... అధికారులు పట్టించుకోకపోవడమే ఈ దాడికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వాడ్యాల, మిడ్జిల్, రాజాపూర్, అడ్డాకుల, మూసాపేట, నారాయణపేట, మక్తల్ లాంటి మండలాల్లోనూ ఈ తరహా ఘటనలు జరగడం ఉమ్మడి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది.

sand mafia in mahaboobnagar district
sand mafia in mahaboobnagar district

By

Published : Apr 16, 2021, 7:27 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు మరోసారి వెలుగుచూశాయి. మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడ్యాలలో దుంధుబి వాగు నుంచి ఇసుకను తరలించకుండా అడ్డుకున్న మధు అనే యువకునిపై ట్రాక్టర్ యజమానులు కత్తులతో దాడి చేశారు. మరోఇద్దరు రైతులపైనా దాడికి దిగారు. ఈ ఘటనతో మహబూబ్​నగర్ జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. కొంతకాలంలో దుందుభివాగు నుంచి ఇసుక అక్రమ రవాణాను అక్కడి రైతులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 11 గంటలకు పొలాలకు నీళ్లు పెట్టేందుకు భాస్కర్, జంగయ్య దుందుభి వాగు వైపు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రాక్టర్ యజమానులు బీరయ్య, రమేశ్​, శ్రీశైలం, రామకృష్ణ, శ్రీను తదితరులు వారిపై దాడి చేశారు. బాధితులు మిడ్జిల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

రెచ్చగొట్టి మరీ రప్పించారు...

ఈ క్రమంలోనే ట్రాక్టర్ యజమానులు మధు అనే మరో రైతుకు ఫోన్ చేసి.. తామే దాడి చేశామని, ఇసుక తరలింపు ఎలా అడ్డకుంటారో చూస్తామని రెచ్చగొట్టారు. జడ్చర్లలో ఉన్న మధు వారి ఫోన్​కాల్​తో అర్థరాత్రి తర్వాత వాడ్యాలకు చేరుకున్నాడు. కొంతమంది రైతుల్ని తీసుకుని దుంధుభీ వాగువైపు వెళ్తుండగా... మార్గం మధ్యలోనే ట్రాక్టర్ యజమానులు అడ్డుపడ్డారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండగానే... మధును కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన మధు ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సమాచారం అందుకున్న మహబూబ్​నగర్ ఆర్డీఓ, తహశీల్దార్... మధును పరామర్శించారు. ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మహబూబ్​నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీధర్ సైతం ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని... అక్రమ రవాణాను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. కేసులు నమోదు చేయడమే కాకుండా... బైండోవర్ చేస్తామని చెప్పారు. ఘటనకు బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా...

వాడ్యాలలో దుందుభీ వాగుకు ఆనుకునే రైతుల పొలాలుంటాయి. అధిక వర్షాలు కురియడం వల్ల బోరుబావులు సైతం నీటితో కళకళలాడుతున్నాయి. ఇసుకను తరలిస్తే బోరుబావులు ఎండిపోతాయని... చేతికందాల్సిన పంట నాశనమవుతుందని 6 నెలలుగా రైతులు ఇసుక తరలింపును అడ్డుకుంటున్నారు. ఐనా రాత్రిరాత్రికి ట్రాక్టర్లలో కొందరు ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వొందంటూ... గతంలో వాడ్యాల గ్రామస్థులు ధర్నాలు చేశారు. అక్రమ రవాణాపై ఎస్సై, తహశీల్దార్ సహా ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. మిడ్జిల్ మండల కేంద్రంలోనూ ముగ్గురు రైతులపై ట్రాక్టర్ల యజమానులు దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఉమ్మడి జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డువచ్చిన వారిపై దాడులకు తెగబడటం కొత్తేమి కాదు. గతంలో రాజాపూర్ మండలం తిర్మలాపూర్​కు సమీపంలో... అడ్డాకుల, మూసాపేట మండలాల్లోనూ ఇసుకను అడ్డుకున్న వారిపై దాడులు జరిగాయి. అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన వారిపైనా భౌతిక దాడులు జరిగాయి. రాజకీయ, అధికారుల అండదండలతో బరితెగించి దాడులకు తెగబడుతున్నా... పట్టించుకున్న నాథుడు కరవయ్యాడు. అధికారులు పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:గాలి ద్వారానూ వైరస్‌ వ్యాప్తి.. ఇవిగో ఆధారాలు!

ABOUT THE AUTHOR

...view details